
- మేం బీసీలకు వ్యతిరేకం కాదు
- రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి: రెడ్డి జేఏసీ
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం సంక్షేమ కోసం ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రెడ్డి జేఏసీ డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరింది. సికింద్రాబాద్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని జేఏసీ అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి అన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లకు, బీసీ కులాలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.