
స్వరాష్ట్రం సాధించుకుని 8 ఏళ్లు గడిచాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణపై జనం కోటి ఆశలు పెట్టుకున్నారు. తమ జీవితాలు మారుతాయని ఆశపడ్డారు. జనం కోరుకుంది ఒకటైతే.. జరిగింది మరొకటి. సమైక్య రాష్ట్రంలో చూసిన పరిస్థితులే స్వరాష్ట్రంలోనూ కనిపిస్తున్నాయి. సంక్షేమం మాట అటుంచితే.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే దిక్కులేని పరిస్థితి నెలకొంది. సుసంపన్నంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పులకుప్పగా మారింది. బంగారు తెలంగాణ కోసం కన్న కలలు కల్లలుగా మారిపోయాయి.
ఆచూకీ లేని ప్రజాస్వామ్య తెలంగాణ
స్వరాష్ట్రంలో బతుకులు బాగుపడతాయనుకున్న వారి ఆశ నిరాశే అయిందని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయం. తెలంగాణ పుట్టిన రోజు నాడైనా అధికారపార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అంటున్నారు. గత 8 ఏళ్లలో ఏం సాధించామన్నది పరిశీలిస్తే ఏం సాధించలేకపోయామన్న విషయం స్పష్టమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని హరగోపాల్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన జేఏసీలు కొనుసాగుతాయని భావించామని, ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుందని ఆశిస్తే అది అత్యాశే అయిందని చెబుతున్నారు. నిధులకు కొరత లేకపోవడంతో సంక్షేమ పథకాలకు ఢోకా లేకుండాపోయిందే తప్ప మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదని హరగోపాల్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని.. కనీసం, సభలు సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితి లేదని అంటున్నారు.
అప్పులకుప్పగా మారిన రాష్ట్రం
సకల జనుల పోరాటంతో తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అన్నారు. 1969 తర్వాత అంతటి స్థాయిలో జరిగిన మలిదశ ఉద్యమంలో 52రోజుల పాటు పాలన స్తంభింపజేసి రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో పారదర్శక పాలన, జవాబుదారీతనం ఉంటుందని భావించినా అలాంటి పరిస్థితి లేదని దిలీప్ కుమార్ వాపోయారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం పరిస్థితులు లేవని అన్నారు. 8 ఏళ్లలో పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, పాలన పూర్తిగా అవినీతిమయమైపోయిందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేకుండాపోయిందని, ప్రస్తుత పాలకులు సమైక్యవాదుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని దిలీప్ కుమార్ విమర్శించారు.
కల్వకుంట్ల రాష్ట్రంలా తెలంగాణ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలేవీ నెరవేరలేదని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న స్ఫూర్తితో పోరాటం చేశామని, సొంత రాష్ట్రంలో అన్నీ సరిదిద్దుకున్నామని అనుకున్నా అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని చెప్పారు. నిధులను తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తారనుకుంటే అలా జరగడంలేదని వాపోయారు. కేసీఆర్ ఉద్యమకారుల్ని పక్కనపెట్టి ద్రోహుల్ని అక్కున చేర్చుకున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని కబ్జా చేసుకుని కుటుంబానికి లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో కుటుంబసభ్యులను రాజకీయాలకు దూరం పెడతానన్న కేసీఆర్ స్వరాష్ట్రం సాధించాక ఆ మాట మర్చిపోయారని, రాష్ట్రాన్ని కల్వకుంట్ల రాష్ట్రంగా మార్చేశారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు.
స్వరాష్ట్రంలో మారని బతుకులు
కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. మీడియాపై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉపాధి, నిధుల ఇలా ప్రతి విషయంలోనూ విఫలమయ్యారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులు మారాయా అన్న ప్రశ్న తలెత్తుతోందని అన్నారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ భ్రాంతిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయడంతో విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారని వాపోయారు. ధనిక రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూడాలని అన్నారు. యువతకు ఏం చేశారో సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారిని మరిచిపోయారని, స్వరాష్ట్రంలో సామాజిక న్యాయం వస్తుందని ఆశిస్తే.. కొన్ని వర్గాలకు పోరాట వేదికగా మారిందని దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాపై వివక్ష
స్వరాష్ట్రంలో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో మీడియా బందీ అయిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వీ6 పాత్ర వెలకట్టలేనిదన్నారు. v6 ఛానల్ లో పనిచేస్తే ఉద్యమంలో పనిచేస్తున్నట్లు అనిపించిందని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన వాళ్లు వీధుల్లో ఉన్నారన్నారు. తెలంగాణ మోడల్ అంటే కుట్రలు, కుతంత్రాలు, కమీషన్లుగా మార్చారని విమర్శించారు. తెలంగాణలో అణిచివేత రాజ్యమేలతోందని.. తెలంగాణ ఉద్యమ ద్రోహులే మంత్రులుగా ఉన్నారని మల్లన్న ఆరోపించారు. 8ఏళ్లలో రాష్ట్రం 80ఏళ్ల వెనక్కి వెళ్లిందని మల్లన్న వాపోయారు. సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా అన్ని పేపర్లలో యాడ్స్ ఇచ్చి తెలంగాణ కోసం పనిచేసిన సంస్థలకు మాత్రం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆనాడు తెలంగాణ విముక్తి కోసం గోల్కొండ పత్రిక పోషించిన పాత్రను తెలంగాణ ఉద్యమంలో వీ6 కీలకపాత్ర పోషించిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మీడియాకు దక్కాల్సిన పాత్ర దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఉద్యమానికి సిద్ధం
ఉద్యమకారులంతా ఏకమై మరోసారి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీఎన్జీవో మీటింగ్ లో జై తెలంగాణ అని నినదించి పోరుబాట పట్టిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ను ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సీఎం కేసీఆర్ ప్రమోషన్ ఇస్తా అని చెప్పి ఇంత వరకు ఇయ్యలేదని మంత్రులను కలిసిన లాభం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్వార్థం వల్ల తనకు ప్రమోషన్ రాలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చాక తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఏడాదిపాటు సస్పెన్షన్ చేశారని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణలన్నీ నీటిమూటల్లాగా తేలిపోయాయని ఇప్పుడు రాష్ట్రం బాగు కోసం మరోసారి ఉద్యమం చేసేందుకు సిద్ధమని అన్నారు.