- షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ
- ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి
- పాత జీవోను సవరించిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్–2026) నిర్వహణకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 తేదీల మధ్యలో ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ గురువారం ప్రకటన విడుదల చేశారు.
శుక్రవారం టెట్ నోటిఫికేషన్విడుదల చేస్తామని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులంతా ఈ నెల 15 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్, డిటెయిల్డ్ నోటిఫికేషన్‌ను schooledu.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇన్ -సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునిస్తూ ఇచ్చిన జీవో 36లో సర్కార్ సవరణలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్కార్, ప్రైవేట్, ఎయిడెడ్ అన్ని బడుల్లోని టీచర్లు తప్పనిసరిగా టీజీ టెట్ లేదా సీటెట్ క్వాలిఫై కావాలని తెలిపింది. దీనికి అనుగుణంగా జీవో 28ను విద్యాశాఖ సెక్రటరీ శ్రీదేవసేన రిలీజ్ చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు (డీఈడీ, బీఈడీ అర్హత ఉన్నవారు) పేపర్ 1కు హాజరుకావాలని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజీ పండిట్లు, హైస్కూల్ హెడ్మాస్టర్లు పేపర్2కు అటెండ్ కావాలని చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని టెట్ చైర్మన్‌ను ఆదేశించారు.
45 వేల మంది కొలువులకు ఎసరు..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదవీ విరమణకు ఐదేండ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు తమ సర్వీస్‌ను కొనసాగించాలంటే.. ఉత్తర్వుల తేదీ (సెప్టెంబర్1) నుంచి రెండేళ్లలోపు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలి. ఒకవేళ అర్హత సాధించకపోతే రిటైర్డ్ కావాల్సి ఉంటుంది. ఐదేండ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న టీచర్లకు మినహాయింపు ఉన్నప్పటికీ, వాళ్లు ప్రమోషన్ కోరుకుంటే మాత్రం టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. ఈ తీర్పునకు అనుగుణంగా టెట్ రాసుకునేందుకు టీచర్లకు అవకాశం ఇచ్చారు.
అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో 45,742 మంది టీచర్ల కొలువులు ప్రమాదంలో పడ్డాయి. వారంతా తప్పనిసరిగా రెండేండ్లలో టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. మరోపక్క 60,094 మంది టీచర్లు ప్రమోషన్లు కావాలంటే టెట్ అర్హత సాధించాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే భయంతో ముందుగానే ప్రభుత్వం జీవోలో మార్పులు చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్ల నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టులో ఎన్‌సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తర్వాత జరిగిన అన్ని టీచర్ల నియామకాల్లో టెట్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అప్పట్లో ఎన్‌సీటీఈ ఉత్తర్వుల్లో అప్పటికే నియామకమైన వారికి టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. దీంతో టెట్ పరీక్షను ఇన్ సర్వీస్ టీచర్లు పట్టించుకోలేదు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ టీచర్లంతా టెట్ రాసే అవకాశం ఉంది.
