- స్కిల్ వర్సిటీలో జర్మన్ భాష విభాగం ఏర్పాటు చేయండి: భట్టి
- ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో పరస్పర సహకారం
- జర్మనీ పార్లమెంటు బృందంతో డిప్యూటీ సీఎం భేటీ
- 2047 విజన్ డాక్యుమెంట్‌కు జర్మనీ బృందం కితాబు
హైదరాబాద్, వెలుగు: మెటలర్జీ కార్ల తయారీ రంగంలో జర్మనీతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీలో జర్మన్ భాష విభాగాన్ని ఏర్పాటు చేయాలని జర్మనీ పార్లమెంట్ బృందాన్ని కోరారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు ఆ భాష నేర్చుకొని జర్మనీలో పనిచేసే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రజాభవన్ లో శుక్రవారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన జర్మనీ పార్లమెంట్బృందంతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీ దేశానికి పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలిపారు. జర్మనీ, భారత్ మధ్య బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
జర్మనీ ప్రభుత్వం ఈ రంగాల్లో పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, కలిసి పని చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ ఐటీ రంగానికి హబ్ గా వెలుగొందుతోందని ఈ రంగాల్లో జర్మనీతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యత: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయాల్లో చాలా దూరదృష్టితో సైబర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ఏర్పాటు చేశామని ఈ రంగంలో లోతుగా స్టడీ చేస్తున్నామని జర్మనీ పార్లమెంట్ బృందానికి వివరించారు. సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేశామని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా రెండు ఫ్లోర్లు కేటాయించామని తెలిపారు. జిల్లాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సైబర్ ఫిషింగ్ జరగకుండా అరికట్టేందుకు బెస్ట్ ఏఐ టూల్స్ వాడుతున్నట్టు మంత్రి వివరించారు.
రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అద్భుతం: జర్మనీ బృందం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని జర్మనీ పార్లమెంటు బృందం అభినందించింది. సైబర్ సెక్యూరిటీ, స్కిల్ లేబర్ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నామని వివరించింది. జర్మనీకి చెందిన పెట్టుబడిదారులు చాలామంది భారతదేశంలో పెట్టుబడులు పెట్టారని, తమ దేశానికి చెందిన బోష్ వంటి ప్రసిద్ధ కంపెనీలు, ఇంజనీర్లు ఇక్కడ పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నట్టు వివరించింది.
భారతదేశానికి చెందిన 60 వేల మంది విద్యార్థులు జర్మనీలో వివిధ రకాల కోర్సులను స్టడీ చేస్తున్నారని తెలింది. ప్రతిభావంతులైన విద్యార్థులకు, స్కిల్డ్ లేబర్ కు భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో కొదవలేదని చెప్పింది. జర్మనీ పార్లమెంటరీ బృందంలో జోసఫ్ ఓస్టర్, డానియల్, టిజెన్ అటోగ్లు, బెర్డ్న్ బవుమన్, లార్స్ క్యాస్టల్యుస్కీ, లామ్య కద్దోర్, కర్లా బొంగర్, సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, కృష్ణ భాస్కర్, హరీశ్, బుద్ధ ప్రకాష్ జ్యోతి పాల్గొన్నారు.

