నిర్మాతలతో సినీ కార్మికుల చర్చలు ఫెయిల్

 నిర్మాతలతో సినీ కార్మికుల చర్చలు ఫెయిల్
  • కండిషన్లు ఒప్పుకుంటే జీతాలు పెంచుతామన్న ప్రొడ్యూసర్లు
  • రోజుకు రూ.2 వేలు తీసుకునే కార్మికులకు మూడు దశల్లో హైక్  ఉంటుందని వెల్లడి
  • షరతులకు ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పిన యూనియన్లు
  •  పర్సంటేజీ విధానం తమకు ఆమోదయోగ్యంగా లేదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలతో జరిగిన కార్మికుల చర్చలు విఫలం అయ్యాయి. నిర్మాతలు ప్రకటించిన  పర్సంటేజీ విధానం తమకు ఆమోదయోగ్యంగా లేదని కార్మికులు తెలిపారు. ఫిల్మ్  ఫెడరేషన్‌‌లోని 13 యూనియన్లకు సమన్యాయం చేయాలని కోరారు.  లేకపోతే ఈ నెల 10 నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని ఫిల్మ్  ఫెడరేషన్  ప్రెసిడెంట్  వల్లభనేని అనిల్  హెచ్చరించారు.  ‘‘పర్సంటేజీ విధానం అన్ని యూనియన్లకు సమానంగా ఇస్తే  మేం అంగీకరించే వాళ్లం.

 కానీ, ఫెడరేషన్‌‌ను విభజించేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయి. నిర్మాతల ప్రపోజల్స్ ఏ ఒక్కటీ  మేం ఒప్పుకోం. అన్ని సంఘాలకూ ఒకేలా వేతనాలు పెంచాలి’’ అని అనిల్  చెప్పారు. అంతకుముందు  ఫిల్మ్  చాంబర్‌‌‌‌లో యాక్టివ్  తెలుగు ఫిల్మ్  ప్రొడ్యూసర్స్  గిల్డ్   సభ్యులు  వేతనాల పెంపుపై పలు ఆంక్షలు విధిస్తూ తమ తుది నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్  సీఈఓ చెర్రీ  మాట్లాడుతూ 50 ఏళ్లుగా సినీ పరిశ్రమ ఇక్కడ ఉపాధి పొందుతోందన్నారు. ‘‘గడిచిన కాలంలో కార్మికుల వైపు నుంచి గానీ, నిర్మాతల వైపు నుంచి గానీ  ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి. 

చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చిన సమస్యను కూడా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, కార్మికులు కోరుకున్న  30 శాతం పర్సంటేజీ మాకు అనుకూలంగా లేదు. మా  కండిషన్స్  వాళ్లు ఒప్పుకుంటే వేతనాలు పెంచడానికి మేము రెడీగా ఉన్నాం.  రోజుకు రూ.నాలుగైదు వేలు  తీసుకునే వారికి పెంచడం సాధ్యం కాదు’’ అని చెర్రీ తెలిపారు. హైదరాబాద్‌‌లో ఉన్న ఖర్చులను పరిగణనలోకి తీసుకుని  రోజుకు రూ.2 వేలు లోపు తీసుకునే సినీ కార్మికుల వేతనాలు  పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మూడు విడతల్లో వేతనాలు పెంచుతామన్నారు. రోజుకు రూ.2 వేలు లోపు ఆదాయం ఉన్నవారికి  మొదటి సంవత్సరం 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో సంవత్సరం మరో 5 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అలాగే  రోజుకు రూ.వెయ్యి రూపాయలు తీసుకునే  సినీ కార్మికులకు మొదటి సంవత్సరం 20 శాతం, రెండో ఏడాది ఏమీ లేకుండా మూడో సంవత్సరం 5 శాతం పెంచుతాం’ అని చెప్పారు. 

చిన్న బడ్జెట్  సినిమాలకు మినహాయింపు 

నిర్మాత దామోదర్  ప్రసాద్  మాట్లాడుతూ చిన్న బడ్జెట్  సినిమాలకు పాత వేతనాల చెల్లింపు కొనసాగుతుందన్నారు. కార్మికులు డిమాండ్  చేసినట్లుగా చిన్న నిర్మాతలు వేతన పెంపు భారాన్ని భరించలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో వారికి మినహాయింపు ఇచ్చామని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాతలు మైత్రీ నవీన్, విశ్వప్రసాద్, నాగవంశీ, సుధాకర్  చెరుకూరి, రాధామోహన్, సాహు గారపాటి,  ఎస్‌‌కెఎన్, బాపినీడు తదితరులు పాల్గొన్నారు.  

నేనెవరినీ కలవలేదు: చిరంజీవి 

సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై తనను ఎవరూ కలవలేదని, తాను కూడా ఎవరినీ కలవలేదని నటుడు చిరంజీవి తెలిపారు. సినీ కార్మికులు కొందరు శనివారం తనను కలిశారంటూ వచ్చిన వార్తల్లో  నిజం లేదని ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్  చేశారు. ‘‘ఫిల్మ్ ఫెడరేషన్  సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి నేను వారిని కలిసినట్లు, 30 శాతం వేతన పెంపు వంటి డిమాండ్లను అంగీకరించినట్లు తప్పుడు ప్రకటనలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఫెడరేషన్‌‌కి చెందిన ఎవరినీ నేను కలవలేదు. 

ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. ఇలాంటి సమస్యలకు ఏకపక్షంగా హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్  చాంబరే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం చాంబర్‌‌  సమిష్టి బాధ్యత. అంతవరకు గందరగోళం సృష్టించే ఉద్దేశంతో చేసిన ఇలాంటి నిరాధారమైన ప్రకటనలను ఖండిస్తున్నా” అని చిరంజీవి పేర్కొన్నారు.