మెదక్ రామాలయ వ్యవహారం వివాదాస్పదం.. ఎండోమెంట్అధికారులను అడ్డుకున్న స్థానికులు

 మెదక్ రామాలయ వ్యవహారం వివాదాస్పదం.. ఎండోమెంట్అధికారులను అడ్డుకున్న స్థానికులు
  • ఆధీనంలోకి తీసుకునేందుకు వచ్చిన ఎండోమెంట్ అధికారులు
  • అభ్యంతరం తెలిపిన ఆలయ కమిటీ

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని కోదండ రామాలయ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు  అధికారులు రాగా ఆలయ బాధ్యులు, భక్తులు, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎండోమెంట్ ఇన్​స్పెక్టర్ రంగారావు, జూనియర్ అసిస్టెంట్లు సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, శ్యామ్, మెదక్ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​లక్ష్మణ్, టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి కోదండ రామాలయానికి  వచ్చారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆలయ కమిటీకి రెండుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేదని ఎండోమెంట్ అధికారులు తెలిపారు. ఆలయానికి సంబంధించిన రికార్డులు, లెక్కల వివరాలు  సమర్పించాలని కోరినా ఇవ్వలేదని ఇన్​స్పెక్టర్​రంగారావు ఆరోపించారు. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకోవడం కోసం వచ్చినట్లు వివరించారు. ఆలయంలోని  హుండీలకు సీల్ వేసేందుకు సిద్ధం కాగా రామాలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, సభ్యులు శ్రీనివాస్, మల్లేశం, బద్రీనాథ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధికారులను అడ్డుకున్నారు. శ్రీనివాస్ విషయాన్ని ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఎంపీతో మాట్లాడేందుకు నిరాకరించడంతో వారిని బయటకు పంపాలని ఎంపీ సూచించారు. ఎండోమెంట్ అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగిపోయారు. జరిగిన విషయాన్ని ఎండోమెంట్  కమిషనర్ కు నివేదిస్తామని తెలిపారు.