
మంచిర్యాల, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ముందే ఆ పార్టీ నేతలు బూతులు తిట్టుకున్నరు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని రాంచందర్‌రావు మంగళవారం పరామర్శించారు. స్టేట్ చీఫ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా ఈ రచ్చ చోటుచేసుకుంది. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్చార్జి గోమాస శ్రీనివాస్, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ను ‘ఏయ్ వెంకటేశ్’ అంటూ సంబోధించారు.
దీంతో వెంటనే రియాక్టయిన వెంకటేశ్ ‘అరేయ్ అంటే చెంప పగుల్తది’ అని సీరియస్ అయ్యారు. దానికి గోమాస శ్రీనివాస్ ‘నిన్ను బట్టలూడదీసి కొడ్త’ అంటూ వెంకటేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంకటేశ్ కోపంగా శ్రీనివాస్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. అందరూ కలిసి ఆయన భుజాలపై చేతులు వేసి కూర్చోబెట్టారు. రాంచందర్‌రావు సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.