- నివారణకు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
- గవర్నమెంట్ స్కూళ్లతోపాటు ప్రైవేట్ బడుల్లోనూ కమిటీలు
- త్వరలో గైడ్‌లైన్స్ రూపకల్పన
హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు, కాలేజీల్లోకి డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇటీవల పలు స్కూళ్లు, కాలేజీల్లో చదివే స్టూడెంట్లలో కొందరు గాంజా, ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడ్తున్న ఘటనలు వెలుగు చూశాయి. మత్తుకు బానిసలైన పిల్లలనే డ్రగ్స్ ముఠాలు తమ బిజినెస్‌కు పావులుగా వాడుకుంటున్నారు. దీంతో విద్యాసంస్థల్లోకి డ్రగ్స్ఎంట్రీని అడ్డుకోవడంతోపాటు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై స్టూడెంట్లలో అవగాహన పెంచి, అప్రమత్తం చేసేందుకు అన్ని హైస్కూళ్లలో ప్రహరీ కమిటీలు వేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవో నంబర్ 20 రిలీజ్ చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకున్న ప్రైవేటు, గవర్నమెంట్ స్కూళ్లలో ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రతి స్కూల్లో ప్రహరీ కమిటీ ప్రెసిడెంట్‌గా హెడ్మాస్టర్ లేదా ప్రిన్సిపల్ కొనసాగుతారు. వైస్ ప్రెసిడెంట్‌గా సీనియర్ టీచర్ లేదా చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్, మెంబర్లుగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి క్లాసు నుంచి ఇద్దరు విద్యార్థులు, పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ నుంచి ఒకరు, లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ప్రతినిధి మెంబర్లుగా కొనసాగుతారు. త్వరలోనే ప్రహరీ క్లబ్ గైడ్ లైన్స్ విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.