డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ అటెండెన్స్

డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ అటెండెన్స్
  • సీఎం ఆదేశాల అమలుకు టీజీసీహెచ్ఈ చర్యలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇక డుమ్మా చదువులకు చెక్ పడనున్నది. అన్ని విద్యాసంస్థల్లో త్వరలోనే ఫేషియల్ అటెండెన్స్ విధానం అమలు కానున్నది. ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన సమీక్షలో అందరికీ ఫెషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో, దీని అమలుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చర్యలు ప్రారంభించింది.

 దీనికి అనుగుణంగా శుక్రవారం కౌన్సిల్ ఆఫీసులో అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాన ఎజెండాగా ఎఫ్ఆర్ఎస్ విధానం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు11 లక్షల మంది విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ఉన్నారు. వారందరికీ దీన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తున్నది.