విద్యార్థుల భవిష్యత్తు కోసమే..గురుకుల సీఓఈల్లో మార్పులు

విద్యార్థుల భవిష్యత్తు కోసమే..గురుకుల సీఓఈల్లో మార్పులు
  • పేరెంట్ కమిటీ మీటింగ్​లో ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి

హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే గురుకుల సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో మార్పులు చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్ డబ్లూఈఐఎస్ ) సెక్రటరీ వీఎస్ అలుగు వర్షిణి అన్నారు. ఈ అంశంలో పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని సూచించారు. సోమవారం మసాబ్ ట్యాంక్‌‌లోని డీసీసీ భవనంలో నిర్వహించిన పేరెంట్ కమిటీ మీటింగులో ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అలుగు వర్షిణి  మాట్లాడుతూ..గురుకులాల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మెరిట్ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 600 అదనపు సీట్లను కల్పించామని.. 90 నుంచి -95% మార్కులు సాధించిన విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే గౌలిదొడ్డి (బాలురు, బాలికలు), ఉప్పల్ (బాలురు), కరీంనగర్ (బాలికలు)లను ఇంజనీరింగ్ క్యాంపస్‌‌లుగా, మహీంద్రా హిల్స్ (బాలికలు), ఫలక్‌‌నుమా (బాలికలు), చిలుకూరు (బాలురు)లను మెడికల్ క్యాంపస్‌‌లుగా మార్చినట్లు వివరించారు. నీట్ ఫ్యాకల్టీని మహీంద్రా హిల్స్‌‌కు, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీని గౌలిదొడ్డికి బదిలీ చేసినట్లు వెల్లడించారు. 

ఈ మార్పులపై తల్లిదండ్రుల్లో అపోహలు ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వర్షిణి స్పష్టం చేశారు. తమకు గురుకుల్లాల్లోని1.7 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని.. గౌలిదొడ్డి, మహీంద్రా హిల్స్‌‌తో పాటు జిల్లాల్లోని అన్ని సీఓఈల్లో ఉత్తమ ఫ్యాకల్టీ, సమాన సిలబస్, వీకెండ్ పరీక్షలు, బోధన ఏకకాలంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని, గురుకులాలను దేశంలో నంబర్ వన్‌‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో  సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని వర్షిణి పేర్కొన్నారు.