
అమెరికా అధ్యక్షుడి నుంచి హెచ్1బి వీసా రూల్స్ గురించి సమాచారం అందుకోగానే అమెరికాలోని పెద్దపెద్ద కంపెనీలు అలర్ట్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 21 ఉదయం 9 కల్లా తమ ఉద్యోగులు తిరిగి అమెరికా గడ్డపై ఉండాలని చెబుతున్నాయి. కొత్త ట్రావెల్ అడ్వైజరీని అంతర్గతంగా ఉద్యోగులకు మెయిల్ చేస్తున్న కంపెనీలు ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికా వీడి బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నాయి.
దీంతో టెక్ దిగ్గజం అమెజాన్ తమ హెచ్1బి అలాగే హెచ్4 వీసా కలిగిన ఉద్యోగులను యూఎస్ వదిలి వెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇదే క్రమంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ ఉద్యోగులను కనీసం రెండు వారాల పాటు అమెరికాను వదిలి వెళ్లొద్దని చెప్పింది. ట్రంప్ తెచ్చిన కొత్త వీసా రూల్స్ గురించి పూర్తి సమాచారం అలాగే వాటి అమలుపై క్లారిటీ వచ్చేంత వరకు రిస్క్ తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ దేశం దాటి వెళ్లిన వారు వెంటనే 24 గంటల్లోపు తిరిగి యూఎస్ రావాలని కంపెనీలు సూచిస్తున్నాయి.
ALSO READ : H-1B కొత్త నిబంధనలతో 2 లక్షల భారతీయులపై ఎఫెక్ట్..
ఇదే క్రమంలో అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గన్ కూడా తమ హెచ్1బి వీసా ఉద్యోగులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలను అర్జెంటుగా ఆపేయాలని మెయిల్ ద్వారా హెచ్చరించింది. ఇక పోతే అమెరికాలోని టెక్, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఐటీ వంటి ఉద్యోగుల్లో ఎక్కువగా పనిచేస్తున్న హెచ్1బి విదేశీ ఉద్యోగులు ట్రంప్ నిబంధనల అమలు నాటికి తిరిగి యూఎస్ వెళ్లకపోతే వారు ఎంట్రీ కోసం లక్ష డాలర్ల వరకు ఫీజుగా చెల్లించుకోవాల్సి ఉంటుందనే భయాలు కంపెనీలను వెంటాడుతున్నాయి.
OFFICIAL EMAIL FROM MICROSOFT pic.twitter.com/dPJHknPOdY
— ADHIRA (@Adhira_9999) September 20, 2025
అయితే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి హెచ్చరికలనే ట్రావెల్ అడ్వైజరీ పేరుతో తమ విదేశీ ఉద్యోగులకు పంపింది. దీనికి సంబంధించిన ఒక మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వీసా ఫీజుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్కువ సమయం లేదని అయినప్పటికీ వెంటనే యూఎస్ తిరిగి రావటానికి ఏర్పాట్లు చేసుకోవటం మంచిదని ఉద్యోగులను కోరింది కంపెనీ. దేశం బయట ఉన్న ఉద్యోగులకు దీని నుంచి ఏమైనా రక్షణ పొందుతారా లేక వారి హెచ్1బి వీసా హోదాను రద్దు చేస్తారా వంటి ప్రశ్నలకు ప్రస్తుతం తమ వద్ద సమాధానం లేదని తాము కూడా ఈ అంశంపై న్యాయపరమైన క్లారిటీ కోసం వేచి చూస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తన మెయిల్ లో వెల్లడించింది. చాలా మందిలో ఇది ఆందోళన కలిగిస్తుందని తెలుసని కానీ తమ వద్ద కూడా జవాబులు లేనందున వీలైనంత త్వరగా అమెరికాకు రావటం ఉత్తమంగా ప్రస్తుతానికి సూచించింది మైక్రోసాఫ్ట్.