ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వినియోగదారుల భద్రత కోసం గూగుల్ మరో అడుగు ముందుకు వేసింది. 2025లో ప్లే స్టోర్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు దాదాపు 17.5 లక్షల నకిలీ, ప్రమాదకరమైన యాప్‌లను తొలగించింది. ఈ యాప్‌లను కేవలం తీసేయడమే కాకుండా, పదే పదే మోసాలకు పాల్పడుతున్న 80 వేల మంది డెవలపర్ల అకౌంట్లను గూగుల్ శాశ్వతంగా బ్లాక్ చేసింది.
ఈ తొలగించిన యాప్‌లు వినియోగదారులకు రకరకాలుగా హాని చేస్తున్నాయని గూగుల్ గుర్తించింది. వీటిలో డబ్బు దొంగతనం అంటే యూజర్లకు తెలియకుండానే బ్యాంక్ వివరాలు సేకరించడం, నకిలీ సబ్‌స్క్రిప్షన్ల పేర్లతో అనుమతి లేకుండానే డబ్బులు కట్ అయ్యేలా యాప్‌లో చేర్చుకోవడం, డేటా చోరీ చేసేందుకు మీ వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను దొంగిలించడం, ఫోన్ పర్ఫార్మెన్స్ దెబ్బతీసే మాల్వేర్‌లను ఫోన్‌లోకి పంపడం ఉన్నాయి.
గూగుల్ తీసుకున్న కఠిన చర్యలు:
గూగుల్ AI (కృత్రిమ మేధ) సాంకేతికతతో ఈ యాప్‌లు మీ ఫోన్‌లోకి రాకముందే గుర్తుపట్టి ఆపేసింది. అంతేకాకూండా డేటా భద్రత విషయంలో సుమారు 2.5 లక్షల యాప్‌లు యూజర్ల వ్యక్తిగత డేటాను తీసుకోకుండా అడ్డుకుంది. యాప్‌లు బాగున్నాయని నమ్మించేందుకు చేసే 16 కోట్ల ఫేక్ రివ్యూలను, రేటింగ్‌లను తొలగించింది. దీనివల్ల రేటింగ్ చూసి ప్రజలు మోసపోకుండా ఉంటారు.
ఈ మార్పుల వల్ల ముఖ్యంగా మన దేశంలో ఆండ్రాయిడ్ వాడే కోట్ల మందికి భద్రత పెరుగుతుంది. యాప్‌ను డెవలప్ చేసే స్టేజ్ నుండే గూగుల్ నిశితంగా పరిశీలిస్తోంది. ఏదైనా అనుమానం వస్తే వెంటనే వాటిని ప్లే స్టోర్ నుండి బయటకు పంపేస్తోంది. గూగుల్ ఇకపై కూడా AI సాయంతో ప్లే స్టోర్‌ను మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల మనం యాప్స్ డౌన్ లోడ్ చేసేటప్పుడు ఎలాంటి భయం లేకుండా లేదా డేటా చోరీ కాకుండా ఉండొచ్చు.
