
అమెరికా ప్రతి ఏటా విదేశీ టాలెంట్ కోసం అందించే మెుత్తం హెచ్1బి వీసాల్లో 73 శాతం వరకు భారతీయులకే దక్కుతున్నాయి. ఇక ఈ విషయంలో చైనా వాటా కేవలం 10 నుంచి 12 శాతం మధ్యన మాత్రమే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 2లక్షల 7వేల మంది భారతీయులు హెచ్1బి వీసాలను పొందగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది లక్ష 91వేల మందిగా ఉంది. కానీ ట్రంప్ సర్కార్ తెచ్చిన వీసా ఫీజు పెంపుతో ప్రస్తుతం 2 లక్షల మంది వరకు ప్రభావితం కానున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
ట్రంప్ తెచ్చిన కొత్త బిల్లుతో ఏటా భారతదేశానికి లక్ష 80వేల కోట్ల రూపాయల వరకు నష్టం కలగొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా అమెరికాలో పనిచేస్తున్న మిడ్ లెవెల్ భారతీయ ఇంజనీర్లు ఏటా లక్ష 20వేల డాలర్ల వరకు వేతనంగా పొందుతున్నారు. ఇప్పుడు కేవలం వీసా కోసమే లక్ష డాలర్లు ఖర్చు చేయటం అంటే వారికి వచ్చే పే ప్యాకేజీలో 80 శాతం హెచ్1బి వీసా ఫీజు కోసమే వెళ్లిపోతుంది. దీంతో కంపెనీలు కూడా అత్యవసరమైతే తప్ప విదేశీ ఉద్యోగులను భారీ ఖర్చులకు నియమించుకునే అవకాశం ఉండదని తెలుస్తోంది.
ALSO READ : H1B రూల్స్‌తో ఐటీ కంపెనీలు-ఉద్యోగులపై ఇంపాక్ట్ ఇదే..
ప్రస్తుతం అమెరికాకు వెళుతున్న చాలా మంది భారతీయ విద్యార్థులు అక్కడ మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత హెచ్1బి వీసాలపై జాబ్స్ పొందుతున్న కేటిగిరీలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో ఉన్నత విద్య తర్వాత అక్కడే ఉద్యోగంలో స్థిరపడాలని భావించే విద్యార్థుల కలలు అసాధ్యంగా మారిపోనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భారత టెక్ కంపెనీలపై ప్రభావం ఇదే..
ట్రంప్ నిర్ణయంతో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది భారత ఐటీ సేవల రంగం అని తెలుస్తోంది. చాలా కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సేవా రంగం మూల స్థంభంలా ఉన్న సంగతి తెలిసిందే కానీ ట్రంప్ చర్యలతో టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఇకపై హెచ్1బి వీసాలపై అధికంగా ఆధారపడటం కుదరదు. వేల మంది ఇంజనీర్లను అమెరికాలోని ఆన్ సైట్ ప్రాజెక్టులపై పనిచేయించటం కుదరని పని. ఈ పరిస్థితుల వల్ల కంపెనీలు కొత్త వ్యాపార మోడళ్లను తిరిగి మార్చుకోవాల్సి వస్తుందని లేదంటే కెనడా, మెక్సికో లాంటి ప్రాంతాలకు ఈ బిజినెస్ మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అమెరికాలోని బడా టెక్ కంపెనీలు కూడా హెచ్1బి వీసాలపై విదేశీ ఉద్యోగులను నియమించుకోవటం కష్టంగా మారుతుందని తెలుస్తోంది. దీంతో అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, సిటి గ్రూప్, క్యాపిటల్ వన్, వెరిజాన్, ఎటిఅండ్ టి వంటి సంస్థలు ఇబ్బంది పడొచ్చు. అలాగే మరోపక్క ఏఐ కూడా టెక్కీల జాబ్స్ గల్లంతు చేస్తుండటం ఒత్తిడిని పెంచేస్తోంది.