
భారతదేశంలో తల్లిదండ్రుల కల పిల్లలను ఇంటర్ తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివించాలే.. ఆ తర్వాత విదేశాల్లో చదువు లేదా ఉద్యోగానికి పంపాలన్నదే. మధ్యతరగతి యువత కూడా కష్టపడి అమెరికా వెళ్లి జాబ్ లో సెటిల్ అవ్వాలే తర్వాత నాలుగు డాలర్లు ఇండియాకు పంపించి పొలాలు, ఫ్లాట్లు లేదా తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అన్నదే.
కానీ అమెరికా అధ్యక్షుడు శుక్రవారం చేసిన ఒక సంతకం లక్షల మంది భారతీయ ఐటీ ఆశావహుల కలలను చిదిమేస్తోంది. ఇకపై హెచ్1బి వీసాపై అమెరికాలోని కంపెనీల్లో పనిచేయాలంటే గతంలో మాదిరిగా కుదరదు. ఎందుకంటే నియమించుకునే కంపెనీ ఇందుకోసం వీసా ఫీజు లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అత్యంత అవసరమైతో తప్ప ఇక నుంచి యూఎస్ లోని కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోదు. ఈ కొత్త నిబంధనలు భారత ఐటీ పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ నిర్ణయం భారత ఐటీ రంగంతో పాటు సిలికాన్ వ్యాలీలో కూడా నియామకాల్లో పెద్ద మార్పులను తీసుకురాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటన సెప్టెంబర్ 21, 2025న భారత కాలమానం ప్రకారం ఉదయం 9.31 నుంచి అమలులోకి రాబోతోంది. ఆ క్షణం నుంచి అమెరికాలోని యజమాని హెచ్1బి వీసా ఉద్యోగికి లక్ష డాలర్లు రుసుము చెల్లిచకపోతే యూఎస్‌లోకి ఎంట్రీ ఉండదు. ఇప్పటికే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో కొత్త నిబంధన అమలు తర్వాత యూఎస్ లో ఉద్యోగం చేయాలనుకునే కలలకు కళ్లెం పడనుంది.
ఇప్పటి వరకు హెచ్1బి వీసాలకు అప్లై చేసుకునేందుకు రుసుము కేవలం 1500 డాలర్లుగా ఉండేది. కానీ ట్రంప్ విదేశీ ఉద్యోగులను నిరోధించటానికి దానిని ఏకంగా లక్ష డాలర్లకు పెంచటంపై అమెరికా వ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. ఇకపై విదేశీ ఉద్యోగి అమెరికాను వీడి మళ్లీ కొత్తగా ఎంట్రీకోసం వీసా స్టాంప్ కోసం వెళ్లినా లేక 3 ఏళ్ల స్టే కోసం అమెరికాలో వేల డాలర్లు ఇకపై ఖర్చు చేయాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయాలతో చాలా మంది ప్రస్తుతం అమెరికా నుంచి తిరిగి తమ ఊళ్లకు వెళ్లాలన్నా కూడా భయపడుతున్నారు. ఒక్కసారి బయటకు వస్తే మళ్లీ అమెరికాలోకి ఎంట్రీ కుదురుతుందా లేదా అనే భయాలు పెరుగుతున్నాయి.