ఏపీలో వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు

ఏపీలో వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు

అమరావతి: రాష్ట్రంలో వారానికి 5 రోజుల పని విధానం మరో సంవత్సరం పొడిగించారు. రాష్ట్ర విభజన తర్వాత సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేందుకు ప్రభుత్వం ఐదు రోజుల పనివిధానానికి శ్రీకారం చుట్టింది. దాదాపు అందరూ హైదరాబాద్ లోనే నివసిస్తుండడంతో వారి కుటుంబాలను తరలించేందుకు గడువు కోరడం.. అప్పటి ప్రభుత్వం సానుకూలంగా స్పదించిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం మరియు శాఖాధిపతుల కార్యాలయాలకు వారానికి ఐదు రోజుల పనిదినాలు విధానాన్ని మరి కొంత కాలం  కొనసాగించాలని ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చేసిన  విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించింది.
 వారానికి ఐదు రోజులు పని విధానానికి సంబంధించిన  ఫైలుకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో జారీ చేస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.