ఖాసీం రజ్వీతో ఎంఐఎంకు సంబంధంలేదు

ఖాసీం రజ్వీతో ఎంఐఎంకు సంబంధంలేదు

హైదరాబాద్‌‌, వెలుగు:  మజ్లిస్‌‌ పార్టీ విశ్వసనీయతకు ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌, బీజేపీల సర్టిఫికెట్లు అవసరంలేదని ఎంఐఎం చీఫ్​అసదుద్దీన్‌‌ ఒవైసీ స్పష్టం చేశారు. శుక్రవారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాతబస్తీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మ‌‌ధ్యాహ్నం న‌‌మాజ్ ముగిసిన తర్వాత మక్కా మసీదు నుంచి నిర్వహించిన బైక్ ర్యాలీలో అసదుద్దీన్ పాల్గొన్నారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌ సంస్థానం కోసం ఒక్క చెమట చుక్క కూడా విదిల్చని వాళ్లు నేడు విమోచన దినం అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈ గడ్డపై ప్రాణ త్యాగాలు చేసిన హిందూ, ముస్లిం, దళితుల విశ్వసనీయతకు ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌, బీజేపీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీతో ఎంఐఎంకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. బ్రిటీష్‌‌ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగం చేసిన తుర్రెబాజ్‌‌ఖాన్‌‌, మౌల్వీ అల్లాఉద్దీన్‌‌ పోరాట వారసత్వాన్ని తమ పార్టీ పుణికిపుచ్చుకుందన్నారు. వలసవాదం, భూస్వామ్యవాదం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటాలు జాతీయ సమైక్యతకు ప్రతీక అని స్పష్టం చేశారు.