Drishyam 3 : బాక్సాఫీస్ వద్ద మైండ్ గేమ్ షురూ...'దృశ్యం 3' రిలీజ్ డేట్ లాక్ చేసిన అజయ్ దేవగన్!

Drishyam 3 : బాక్సాఫీస్ వద్ద మైండ్ గేమ్ షురూ...'దృశ్యం 3' రిలీజ్ డేట్ లాక్ చేసిన అజయ్ దేవగన్!

మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం 'దృశ్యం'.  సరిగ్గా పదేళ్ల క్రితం (2015) వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఒక సాదాసీదా కేబుల్ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చట్టంతో ఆడిన మైండ్ గేమ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ'దృశ్యం'  ఫ్రాంచైజీ నుండి మరో సంచలన అప్‌డేట్ వచ్చేసింది. అదే విజయ్ సల్గాంకర్ తన తెలివితేటలతో సాగించిన సుదీర్ఘ పోరాటానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని లేటెస్ట్ గా అజయ్ దేవగన్ స్వయంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.

అక్టోబర్ 2వ తేదీ.. మళ్ళీ అదే సెంటిమెంట్!

దృశ్యం సినిమాలో విజయ్ సల్గాంకర్ ఫ్యామిలీ 'అక్టోబర్ 2న పనాజీకి వెళ్లడం' అనేది ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. అందుకే మేకర్స్ ఈ మూడో భాగాన్ని కూడా అదే తేదీన, అంటే అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. "ఆఖరి హిస్సా బాకీ హై" (చివరి ఘట్టం మిగిలే ఉంది) అంటూ అజయ్ దేవగన్ వదిలిన టీజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

షూటింగ్ అప్‌డేట్స్

అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2026 ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసి, భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపనున్నారు. ఈ చివరి భాగంలో కూడా టబు, శ్రియా శరణ్, రజత్ కపూర్ వంటి ఒరిజినల్ కాస్ట్ తమ పాత్రలను పోషిస్తున్నారు. గత రెండు భాగాల కంటే ఈసారి ట్విస్టులు మరింత భయంకరంగా, ఊహకందని విధంగా ఉంటాయని సమాచారం.

 మలయాళ వెర్షన్ రికార్డులు..

మరోవైపు, మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ మలయాళ 'దృశ్యం 3' షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్ రైట్స్ కలిపి ఏకంగా రూ. 350 కోట్లు పలికినట్లు మాలీవుడ్ వర్గాల సమాచారం. ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి, అది కూడా విడుదల కాకముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక రికార్డు. మలయాళం కంటే రెండు నెలల తర్వాత హిందీ వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ALSO READ : బిగ్‌బాస్ 9 ట్రోఫీ మిస్సైనా భారీగా వెనకేసిన తనూజ..

బాక్సాఫీస్ వద్ద 'దృశ్యం' మ్యాజిక్

'దృశ్యం' మొదటి భాగం (2015) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సుమారు 48 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఈ చిత్రం  రూ. 110 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రెండో భాగం (2022) కూడా  బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించి ఏకంగా 342 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడో భాగం (2026) ముగింపు కావడంతో ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఈ కథను రీమేక్ చేసినప్పటికీ, హిందీలో అజయ్ దేవగన్ మార్క్ యాక్టింగ్ ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. మరి విజయ్ సల్గాంకర్ తన కుటుంబాన్ని చివరగా ఎలా సేఫ్ చేస్తాడో చూడాలంటే 2026 అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే!