- డిసెంబరులో ప్రయోగించే అవకాశం
బెంగళూరు: అంతరిక్ష ప్రయోగాల్లో కీలక మలుపు. దేశీయంగా రూపొందించిన పూర్తిస్థాయి ప్రైవేటు ఉపగ్రహాన్ని తొలిసారి భారత భూభాగం నుంచి ప్రయోగించనున్నారు. బెంగళూరుకు చెందిన పిక్సెల్ అనే అంకుర సంస్థ పూర్తి స్థాయిలో ఓ ప్రైవేటు ఉపగ్రహాన్ని తయారు చేసింది. దీన్ని వచ్చే డిసెంబర్ నెలలో ప్రయోగించనున్నట్లు సమాచారం. ఈ శాటిలైట్ పేరు.. ప్రయోగించే తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఏడాదిలోనే ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.
భారత్ 2018లోనే తొలి ప్రైవేటు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. దాన్ని అమెరికా కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ వైమానిక స్థావరం నుంచి స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించారు. అయితే ఓ ప్రైవేటు సంస్థ పూర్తి స్థాయిలో రూపొందించి భారత భూభాగం నుంచి ప్రయోగించనున్న భారత తొలి ప్రైవేటు శాటిలైట్ మాత్రం తమదేనని పిక్సెల్ అధినేత అవైస్ అహ్మద్ అంటున్నారు. తమ ఉపగ్రహాన్ని రష్యా నుంచి నింగిలోకి పంపాలనుకున్నామని.. అయితే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని ఆయన వెల్లడించారు.
