స్కూల్ ​పిల్లలను రూమ్​లో బంధించి కొట్టిన ఇంటర్​ స్టూడెంట్లు

స్కూల్ ​పిల్లలను రూమ్​లో బంధించి కొట్టిన ఇంటర్​ స్టూడెంట్లు

అచ్చంపేట, వెలుగు: నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేట సోషల్​వెల్ఫేర్​స్కూల్ ఇంటర్​స్టూడెంట్లు స్కూల్​పిల్లలను హాస్టల్​రూమ్​లో బంధించి చితకబాదారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్​కు చెప్పినా పట్టించుకోకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు సోమవారం స్కూల్​ముందు ఆందోళనకు దిగారు. ఇంటర్​స్టూడెంట్లు పట్టుకుని కొడుతుంటే ప్రిన్సిపల్, టీచర్లు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ సందర్భంగా కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత స్టూడెంట్లు మాట్లాడుతూ.. ఆరుగురు ఇంటర్​సెకండ్​ఇయర్ స్టూడెంట్లు శనివారం రాత్రి తమను కొట్టారని, ఆదివారం రాత్రి రూమ్​లో బంధించి మరోసారి 20 మంది వాటర్​పైపులతో చితకబాదారని వాపోయారు. రాత్రి10 గంటలకు రూమ్​లో వేసి తెల్లవారుజామున 3.15కు విడిచి పెట్టారని, కొట్టిన విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించారని వాపోయారు.

తల్లిదండ్రులు మాట్లాడుతూ.. 6, 7, 8 తరగతుల పిల్లలను కొట్టిన సీనియర్లతోపాటు స్కూల్​సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్​స్కూల్​లో విధులు నిర్వహించాల్సిన టీచర్లు ఇంటర్ పిల్లలకు బాధ్యతలు అప్పజెప్పి బయటికి వెళ్తుండడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ రాములును వివరణ కోరగా జూనియర్ కాలేజీ స్టూడెంట్లు స్కూల్​పిల్లలపై దాడిచేసిన విషయం వాస్తవమేనని, తెలిసిన వెంటనే పిలిచి మందలించినట్లు తెలిపారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల డిమాండ్ మేరకు టీసీలు ఇచ్చి పంపించేస్తామని చెప్పారు.