ధరలు దిగొస్తయ్!

ధరలు దిగొస్తయ్!

న్యూఢిల్లీ: కేంద్రం పెట్రో ప్రొడక్టులు, ఎల్పీజీ, స్టీల్​, ఎరువులపై ఎక్సైజ్​ డ్యూటీలను, పన్నులను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యుడికి ఎంతో మేలు జరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పెట్రో ధరల పెరుగుదల వల్ల అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, ఇక నుంచి ఇవి కొంత మేర తగ్గుతాయని అంటున్నారు.  పెట్రోలు, డీజిల్‌‌‌‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8, లీటర్‌‌కు రూ.6 చొప్పున తగ్గించడం, ఎల్పీజీ సబ్సిడీ  కస్టమ్ డ్యూటీలపై తగ్గింపుల వల్ల ఇంటి బడ్జెట్​పై భారం తక్కువ కానుంది.    
 

పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎక్సైజ్ డ్యూటీ కోత
పెట్రోలు, డీజిల్‌‌పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం.. జనానికి అన్నింటికంటే ఎక్కువ మేలు చేస్తుంది. వీటి రేట్లు దిగిరావడం వల్ల ఆహారం, రవాణా సహా చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి. ఇంటి బడ్జెట్‌‌లపై ఇన్​ఫ్లేషన్​ ప్రభావాన్ని కొంతవరకు ఎదుర్కోవచ్చు. ఎక్సైజ్‌‌ సుంకాల కోత వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది.   పెట్రోల్, డీజిల్‌‌పై రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కూడా తగ్గితే రేటు మరింత దిగివస్తుంది.   
 

ఎల్పీజీ సబ్సిడీ
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఎల్‌‌పీజీ సిలిండర్‌‌లపై రూ.200 చొప్పున సబ్సిడీని అందిస్తారు. ఇలా 12 సార్లు ఇవ్వడం వల్ల ఇంటి బడ్జెట్​పై భారం మరింత తగ్గుతుంది. ఎక్కువ ధరల కారణంగా సిలిండర్​ను కొనడం మానేసిన వాళ్లు మళ్లీ కొంటారు. దీంతో ప్రభుత్వానికి పన్నుల ఆదాయమూ పెరుగుతుంది.    దేశవ్యాప్తంగా రైతులకు ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం బడ్జెట్‌‌లో రూ.1.05 లక్షల కోట్లు కేటాయించింది. ఇందుకోసం తాజాగా మరో రూ.1.10 లక్షల కోట్లు కేటాయించారు.దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. సాగు ఖర్చు అదుపులో ఉంటుంది. కూరగాయలు, పప్పుల రేట్లు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. 

కస్టమ్ డ్యూటీ తగ్గింపు
భారతదేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే కొన్ని వస్తువుపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. ఇది ప్లాస్టిక్ తయారీకి వాడే ఇంటర్​మీడియరీలపై సుంకాన్ని తగ్గించడం వల్ల సంబంధిత వస్తువుల ధరలు దిగివస్తాయి. ఈ నిర్ణయం వల్ల ప్లాస్టిక్ ఉత్పత్తుల పరిశ్రమకు కూడా మేలు చేస్తుంది. స్టీలు తయారీలో వాడే ముడి పదార్థాలపైనా కస్టమ్ సుంకాలను తగ్గించడంతో ఇనుము ధరలు దిగివస్తాయి. దీనివల్ల ఎన్నో పరిశ్రమలకు మేలు జరుగుతుంది. చుక్కల్లో ఉన్న సిమెంటు ధరలను తగ్గించడానికి కూడా ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. సప్లై ఇబ్బందులను తొలగిస్తామని, ముఠాతత్వం లేకుండా చేస్తామని తెలిపింది. దీనివల్ల సిమెంట్​ ధర కూడా తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.