
యాదాద్రి భువనగిరి జిల్లా , వెలుగు: కోతుల సమస్య పెద్దదేం కాదని, అవి దేశమంతా ఉన్నట్టే మన దగ్గరా ఉన్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘‘వరికి బదులు ఎక్కువ లాభాలొచ్చే ఆరుతడి పంటలను సాగు చేయాలని చెబితే.. కోతులు, పందులు నాశనం చేస్తాయని కొందరు రైతులు అంటున్నరు. కోతులు దేశమంతా ఉన్నయ్. కోతులొచ్చాక మనమొచ్చినం. వాటికి ఆవాసమైన అడవులను, పండ్ల చెట్లను మనమే నరికేసినం. అందుకే అవి ఊర్ల మీదపడ్డయ్. రైతులందరూ కూరగాయల తోటలు, ఆరుతడి పంటలు వేస్తే... కోతులొచ్చినా ఒకటి రెండు కంకులు తినిపోతయ్. ముందు కొంత సమస్య ఏర్పడినా.. తర్వాత సద్దుమణుగుతది” అని ఆయన పేర్కొన్నారు. అగ్రికల్చర్ స్టాఫ్ పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఈవోలతో పాటు ఏవో, ఏడీవోలు కూడా ఫీల్డ్ మీదకు వెళ్లాలన్నారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించడంలో అగ్రికల్చర్ స్టాఫ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ‘వరి వద్దు ఆదాయం ఇచ్చే ఇతర పంటలు ముద్దు’ అనే విషయం రైతులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రివ్యూలో మీటింగ్ లో మాట్లాడారు మంత్రి జగదీశ్‌రెడ్డి.