పసిపిల్లల తల్లులు జైలుకు: హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు

పసిపిల్లల తల్లులు జైలుకు: హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు

14 రోజులు రిమాండ్​ మొత్తం 23 మంది అరెస్టు.. అందులో 20 మంది మహిళలే 
వివాదాస్పదంగా మారుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసుల తీరు

ఖమ్మం, వెలుగు: ఫారెస్ట్​ సిబ్బందిపై దాడి చేసి, హత్య చేయబోయారంటూ పసికందుల తల్లులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారులతోపాటు ఖమ్మం జైలుకు తరలించారు. హత్యాయత్నం కింద కేసులు కూడా నమోదు చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో జరిగిందీ ఘటన. పోడు భూముల విషయంలో అడ్డువచ్చిన వారిపై ఖమ్మం ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌‌లో ఈనెల 3న పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు తాము వెళ్లగా, 60 మంది స్థానికులు తమపై రాళ్లతో దాడి చేశారని పోలీసులకు అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కొణిజర్ల పోలీసులు.. గురువారం 12 మందిని, శుక్రవారం 11 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో పసిపిల్లల తల్లులు ముగ్గురు ఉన్నారు. అరెస్ట్ అయిన 23 మందిలో ముగ్గురు మగవాళ్లు కాగా, మిగిలిన వారందరూ మహిళలే.
ఆ రోజు ఇదీ జరిగింది..
ఈనెల 3న ఫారెస్ట్ సిబ్బంది కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌‌‌‌కు వెళ్లారు. వారిని పోడు భూముల సమీపంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. తాము సాగు చేస్తున్న పత్తి చేన్లను నాశనం చేయొద్దని, మొక్కలు పీకేయొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బంది, పోడు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. కానీ స్థానికులు తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఫారెస్ట్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఎల్లన్ననగర్ సమీపంలోని గుబ్బగుర్తి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో రెండు గుట్టల మధ్య మార్కింగ్ చేస్తుండగా తమను రాళ్లతో తరిమికొట్టారని కంప్లైంట్ చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్లు 353, 307, 148 రెడ్ విత్ 149 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోడు రైతులతోపాటు పసి పిల్లల తల్లుల పేర్లను కూడా చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పసి పిల్లల తల్లులు ఎలా దాడి చేస్తరు?
అరెస్టు అయిన వారిలో ఎల్లన్ననగర్‌‌‌‌కు చెందిన మౌనికకు3 నెలల పాప, ఆలపాటి కవితకు 8 నెలల వయసున్న కావ్య, రాణికి ఏడాది వయసున్న అక్షిత ఉన్నారు. వీరిని జైలుకు పంపడంపై ప్రజా సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. పిల్లల తల్లులు రాళ్లతో దాడి చేశారా అంటూ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. 

ఫారెస్టోళ్లపై కేసులు పెట్టాలి
పంటలను ధ్వంసం చేయొద్దని అడిగితే హత్యాయత్నం కేసులు పెడతారా? బాలింతలను, పసిపిల్లలను జైలుకు పంపిస్తారా? ఇదేనా దళిత, గిరిజన ఉద్ధరణ?ప్రజలపై దాడి చేసినందుకు, ఫారెస్ట్ రేంజర్ రాధిక మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుపెట్టాలి. - పోటు రంగారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ