సాగర్ ఎన్నికల్లో లబ్ది కోసమే పీఆర్సీ ప్రకటన

సాగర్ ఎన్నికల్లో లబ్ది కోసమే పీఆర్సీ ప్రకటన

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో లబ్ది కోసమే సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడి.. సభను తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పలేదు.. ఫీజుబులిటీని బట్టి నిర్ణయం అని చట్టంలో ఉంది..గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడమే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంతో చెప్పిన ఆర్థిక మంత్రి తలసరి అప్పు ఎంత ఉందో కూడా చెబితే బాగుండేదన్నారు. 2017 లో ఇవ్వాల్సి ఉన్న పీఆర్సీని ఇప్పుడు ఇస్తూ ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ ఒత్తిడి వల్లనే పీఆర్సీపై నిర్ణయం తీసుకుని నాగార్జున సాగర్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇప్పుడు ప్రకటించారని ఆయన విమర్శించారు. పీఆర్సీ... మిషన్ భగీరథ గురించి గొప్పలు చెప్పుకొనే వీరు అందులో పని చేసిన ఉద్యోగులను తీసేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ లు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సి చైర్మన్ ని నియమించేందుకు సీఎం కి ఐదు నెలలుగా సమయం దొరకడం లేదా..? అని ప్రశ్నించారు. పీఆర్సీ ప్రకటన సీఎం కి ఇష్టం లేదు.. అయినా కష్టం మీద ఇచ్చారు.. ఉద్యోగులను వంచించడానికి జరిగిన కుట్ర అని వివరించారు. ఫ్లెక్సీ లకు పాలభిషేకాలు చేయడం అనే కొత్త ట్రెండ్ ని కేసీఆర్ సీఎం అయ్యాక తీసుకొచ్చారని, ఎప్పటి నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ ని ఎప్పటి నుండి అమలు చేస్తున్నారనేది పాలాభిషేకాలు చేస్తున్న ఉద్యోగుల విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.