మా పైసలు ఎవ్వి?.. ఓటు డబ్బులు రాలేదని మహిళా సంఘాల లొల్లి

మా పైసలు ఎవ్వి?..  ఓటు డబ్బులు రాలేదని మహిళా సంఘాల లొల్లి
  • జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట్​లో ఘటన

జగిత్యాల, వెలుగు : ఓట్ల సందర్భంగా తమకు డబ్బులు ఇవ్వలేదని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కల పేట గ్రామ పంచాయతీ ముందు మహిళా సంఘాలు ఆందోళనకు దిగారు. ఈ నెల 30న ఎన్నికల రోజు ఓ పార్టీకి చెందిన లీడర్లు కొన్ని మహిళా సంఘాల్లో ఒక్కొ మహిళకు ఓటుకు రూ. 500 చొప్పుల లెక్క కట్టి పంపిణీ చేశారని, తమకు ఇవ్వలేదని మహిళలు నిరసన తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీకి చెందిన వారమనే కారణంతో తమకు డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నక్కల పేట్ గ్రామంలో 40 మహిళా సంఘాలు ఉంటే కేవలం 8 మహిళా సంఘాలకే డబ్బులు ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వలేదని వాపోయారు. మహిళా సంఘాల మధ్య డబ్బుల విషయం చర్చకు రాగా, తమకు రాలేదని తెలిసిన సంఘాలు సభ్యులంతా శుక్రవారం ఏకమయ్యారు. అంతా కలిసి గ్రామ పంచాయతీ వద్దకు చేరుకొని డబ్బులు పంచిన మహిళా సంఘాల లీడర్లను అక్కడికి పిలిపించారు. ‘‘అసలు ఎన్ని డబ్బులు వచ్చాయి..? మాకేందుకు ఇవ్వలేదు. ఇస్తే అందరికీ ఇవ్వాలి కదా?” అని ప్రశ్నించారు. స్పందించిన మహిళా సంఘాల లీడర్లు.. ‘‘వచ్చినకాడికి డబ్బులను పంపిణీ చేశాం. అందరికి రాకపోతే మాకేంది.. మా ఇంట్లో నుంచి తీసుకురావాల్నా?’’ అని చేతులు దులుపుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.