అమ్ముకున్న వడ్లకు పైసలు రావట్లే

V6 Velugu Posted on Jun 06, 2021

రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లలో  తీవ్ర జాప్యం
6,959 సెంటర్లకు  2,715 మూసివేత
  96.61 లక్షల టన్నులకు  78.80 లక్షలు సేకరణ
  రైతులకు ఇంకా  5,02 కోట్లు పెండింగ్​ 

వడ్లు కొనుగోలు చేసిన పైసలు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సర్కారు చెప్పినప్పటికీ ఆలస్యమవుతోంది. ఇరవై రోజులైనా పైసలు అందడంలేదు.

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. మే నెలాఖరులోగా వడ్ల సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ జూన్​ వచ్చినా పూర్తికాక రైతులు ఇబ్బంది  పడుతున్నారు. 48 గంటల్లోగా వడ్ల డబ్బులు రైతుల బ్యాంక్​ ఖాతాల్లో జమ చేస్తామని సర్కారు చెప్పినప్పటికీ రోజులు తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ యాసంగి సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 96.61 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఏప్రిల్​ నుంచి దశలవారీగా సెంటర్లను ప్రారంభించారు. మొత్తం 6,959 సెంటర్లకుగాను ఇప్పటికే 2,715 సెంటర్లను క్లోజ్ చేశారు. ఈ నెల 4 వరకు 78.8 లక్షల టన్నుల వడ్లను సేకరించారు. ఇందులో 75.78 లక్షల టన్నులను రైస్​మిల్లులకు తరలించారు. సెంటర్లలో ఇంకా 3.18 లక్షల టన్నుల వడ్లు ఉన్నాయి. మరో 17.80 లక్షల టన్నుల వడ్లు కొనాల్సి ఉంది. లారీల కొరత, మిల్లర్ల కొర్రీలతో పాటు పలు కారణాల వల్ల రవాణా ఆలస్యమవుతోందని ఆఫీసర్లు చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు నిలిపివేసి ఇప్పటివరకు సేకరించిన వడ్లను మిల్లులకు తరలిస్తున్నారు. వారం రోజుల్లో ట్రాన్స్​పోర్టేషన్​ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వడ్లు తడిసిపోతున్నాయి. తడిసిన వడ్లను తీసుకోవడానికి మిల్లర్లు మొండికేస్తున్నారు. క్వింటాల్​కు ఐదు కిలోలకు పైగా కట్​ చేస్తున్నారు. దీనికి ఒప్పుకుంటేనే అన్​లోడింగ్​చేసుకుంటున్నారు. లేకుంటే లారీలను తిప్పి పంపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా సమయంలోనే క్వింటాల్​కు ఐదు కిలోలు తప్ప, తాలు పేరుతో కోత పెట్టారు. మళ్లీ మిల్లర్లు ఐదు కిలోలు కట్​ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.  
రూ.5 వేల కోట్లకు పైగా పెండింగ్​
వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల బ్యాంక్​ ఖాతాల్లో పైసలు జమ చేస్తామని సర్కారు చెప్పినప్పటికీ ఆలస్యమవుతోంది. పదిహేను ఇరవై రోజులైనా పైసలు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్​ సీజన్​పెట్టుబడులు ఎట్లని ఆందోళన చెందుతున్నారు. రోజూ బ్యాంకులకు వెళ్లి పైసలు పడలేదని తెలిసి ఉత్త చేతుల్తో తిరిగి వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 14,868.58 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేశారు. ఈ నెల 4 వరకు 9,847.84 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. ఇంకా 5,020.96 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. 
ఉమ్మడి జిల్లాలవారీగా వడ్ల కొనుగోళ్ల వివరాలు టన్నుల్లో
జిల్లా    కొనుగోలు అంచనా    కొన్నది
ఆదిలాబాద్​    4,25,809    4,11,476
నిజామాబాద్    12,99,934    11,54,312
మెదక్    11,50,557    9,13,113
కరీంనగర్​    18,33,441    15,61,333
వరంగల్​ అర్బన్​    12,33,997    9,00,968
ఖమ్మం    5,40,001    3,87,923
నల్గొండ    18,46,991    16,80,100
మహబూబ్​నగర్​    11,55,358    7,47,338
రంగారెడ్డి    1,74,999    1,23,876
    96,61,087    78,80,439

వారం రోజులైనా పైసలు పడలే
60 క్వింటాళ్ల వడ్లు పొలంలో నుంచి  శివ్వంపేట సొసైటీ సెంటర్ కు తీసుకెళ్లిన. నెల రోజులకు కాంట పెట్టిండ్రు. వడ్లు రైస్ మిల్లుకు పోయి వారమైంది. కాంటా పెట్టిన 72 గంటల్ల బ్యాంక్ అకౌంట్ లో పైసలు పడతయని చెప్పిండ్రు. కానీ వారం గడచినా పైసల్ ఇంకా పడలే.                     - అశోక్, రైతు, శివ్వంపేట, మెదక్​ జిల్లా

Tagged grain, money, sold, ikp centers,

Latest Videos

Subscribe Now

More News