జిల్లాల సరిహద్దుల గజిబిజిని సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పు చేర్పులు జరగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావుడిగా, అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఉన్నతాధికారులతో భేటీ అయి జిల్లాల సరిహద్దుల మార్పు, మెగా హైదరాబాద్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలోనే జిల్లాల పునర్విభజన, సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తున్నది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు మధ్య ఉన్న భౌగోళిక దూరాలు, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు.
ఒక్క నియోజకవర్గం.. మూడేసి జిల్లాలు..
జిల్లాల విభజన జరిగిన తీరు పాలన సౌలభ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, రాజకీయంగానూ గందరగోళానికి దారితీసింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాలను రెండు, కొన్ని చోట్ల మూడు జిల్లాల్లో కలిపేశారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. మూడు జడ్పీ మీటింగులకూ హాజరుకావాల్సి వస్తున్నది. ఈ అస్తవ్యస్త విధానం వల్ల అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలులోనూ జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను దృష్టిలో ఉంచుకుని, ఒక నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా లేదా గరిష్టంగా రెండు జిల్లాలకు పరిమితమయ్యేలా సరిహద్దులు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. దీనివల్ల పోలీస్ సబ్ డివిజన్లు, రెవెన్యూ డివిజన్ల మధ్య పొంతన కుదిరి పాలన గాడిలో పడుతుందని భావిస్తున్నది. ఉదాహరణకు ఒక్క మునుగోడు నియోజకవర్గం యదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే పాలకుర్తి నియోజకవర్గం జనగామ, మహబూబాబాద్, మనుమకొండజిల్లాలో ఉండగా, వర్ధన్నపేట, మానకొండూర్, హుస్నాబాద్ వంటి నియోజకవర్గాలు కూడా మూడేసి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి.
