
సెప్టెంబర్ నెల ముగిసి మరో మూడు రోజుల్లో అక్టోబర్ నెల రాబోతోంది. ఈసారి కొత్త నెలతో పాటు కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఈ రూల్స్ ప్రతి ఇంటిపైనా, ప్రతి వ్యక్తి ఆదాయంపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా LPG సిలిండర్ ధరల నుండి పెన్షన్, రైలు టిక్కెట్ల బుకింగ్ వరకు వీటిలో ఉన్నాయి. వచ్చే నెల 1 తేదీ నుండి అమలు కాబోతున్న రూల్స్ ఇవే...
1. గ్యాస్ సిలిండర్ ధరలు: అక్టోబర్ 1 నుండి LPG సిలిండర్ ధరలు మారనున్నాయి. గత కొన్ని నెలలుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు మారుతున్నప్పటికీ, 14 కిలోల వంటింటి LPG సిలిండర్ ధరలు మారలేదు. ఈసారి ధరలు తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నారు. వీటితో పాటు, విమాన ఇంధనం (ATF), CNG, PNG ధరలు కూడా మారే అవకాశం ఉంది.
2. రైలు టిక్కెట్ల బుకింగ్: అక్టోబర్ 1 నుండి రైల్వేకు సంబంధించిన ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆన్‌లైన్ రైలు టిక్కెట్ల బుకింగ్‌లో మోసాలను అరికట్టడానికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుండి టిక్కెట్ రిజర్వేషన్ మొదలైన మొదటి 15 నిమిషాల్లో ఆధార్ (Aadhaar) వెరిఫికేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్ IRCTC వెబ్‌సైట్, యాప్‌లో రెండింటిలోనూ వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ రూల్ తత్కాల్ బుకింగ్‌కు మాత్రమే ఉంది. అయితే, రైల్వే కౌంటర్ల నుండి టిక్కెట్లు కొనే వారికి మాత్రం పాత విధంగానే ఉంటాయి.
3. పెన్షన్ రూల్స్ : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాలు పొందుతున్న పెన్షనర్లపై ఈ మార్పు ప్రభావం ఉంటుంది. 1 అక్టోబర్ 2025 నుండి సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు (CRAలు) వసూలు చేసే ఫీజును పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ సవరించింది. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త PRAN (పెన్షన్ అకౌంట్ నంబర్) తెరిచేందుకు e-PRAN కిట్‌కు రూ.18, ఫిజికల్ కార్డుకు రూ.40 ఛార్జ్ చేస్తారు. ఏడాది మెయింటెనెన్స్ ఛార్జ్ రూ.100 ఉంటుంది.
►ALSO READ | తొక్కిసలాట ఘటనపై విజయ్ TVK పార్టీ సంచలన నిర్ణయం
4. UPI రూల్స్: ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం PhonePe, Google Pay, Paytm వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ను ఎక్కువగా ఉపయోగించేవారికి ఈ రూల్ వర్తించే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పీర్-టు-పీర్ (P2P) ట్రాన్సక్షన్ ఫీచర్ తొలగించొచ్చు. వినియోగదారుల భద్రతను పెంచడానికి, ఆర్థిక మోసాలను నివారించడానికి ఈ ఫీచర్‌ను 1 అక్టోబర్ 2025 నుండి UPI యాప్‌ల నుండి తీసేయనున్నారు.
5. బ్యాంకులకు సెలవులు: అక్టోబర్ నెలలో పెద్ద పండుగలు రానున్నాయి. కాబట్టి, మీకు బ్యాంకుకి సంబంధించిన ఏదైనా పని ఉంటే, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సెలవుల లిస్ట్ చెక్ చేసుకోండి. ఈ నెలలో మహాత్మా గాంధీ జయంతి, దసరా, దీపావళి సెలవులతో మొత్తం 21 రోజులు సెలవులు ఉన్నాయి. ఇందులో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సెలవులు వేర్వేరు రాష్ట్రాలల్లో మారుతూ ఉంటాయి.