నాలుగు నెలలుగా..వరుస చోరీలు..నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో హడలెత్తిస్తున్న దొంగలు

నాలుగు నెలలుగా..వరుస చోరీలు..నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో హడలెత్తిస్తున్న దొంగలు
  • సీసీ కెమెరాల హార్డ్​ డిస్క్​లు మాయం
  • ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్న దుండగులు
  • పోలీసులకు సవాల్​గా మారిన కేసులు    
  • ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు

మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లాలోని మక్తల్  మున్సిపాలిటీలో దొంగలు హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలతో బంగారు వ్యాపారులు, వైన్ షాపుల ఓనర్లు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా చోరీలకు పాల్పడుతుండడం, నాలుగు నెలలుగా జరుగుతున్న చోరీలన్నీ ఒకే రకంగా ఉండడం పోలీసులకు సవాల్​గా మారింది. ఇప్పటి వరకు జరిగిన చోరీల్లో ఒక్క కేసును కూడా పోలీసులు ఛేదించలేకపోయారు. 

ఆధారాలు దొరకకుండా..

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు పోలీసులకు ఆధారాలు దొరకకుండా చేస్తున్నారు. చోరీలు ఏ ముఠా చేసిందనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా మక్తల్​​ సమీపంలోనే కర్నాటక రాష్ట్రం ఉండడంతో ఈ ప్రాంతం నుంచి ఏదైనా ముఠా వచ్చి చోరీలకు పాల్పడుతోందా? లేదా మక్తల్​ ప్రాంతంలోని ఇటుక బట్టీల్లో పనుల కోసం వస్తున్న ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారు చోరీలు చేస్తున్నారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

అయితే చోరీలు చేస్తున్న వ్యక్తులు పక్కా ప్లాన్​ ప్రకారం దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళాలు వేసిన ఇండ్లు, వైన్​ షాపులు, జువెలరీ షాపులే టార్గెట్​గా చోరీలు చేస్తున్నారు. పట్టణ శివార్లలో ఉన్న షాపుల షటర్లు తెరవడానికి కరెంట్​ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. ఆ షాపులకు సంబంధించిన కరెంట్​ మీటర్ల నుంచే కరెంట్​ కనెక్షన్​ తీసుకొని తాళాలు తెరుస్తున్నారు.

 మెయిన్​ రోడ్డులోని షాపుల షటర్లు తెరువకుండా.. షాపు వెనుక భాగంలో రంధ్రాలు చేసి లోపలికి వెళ్తున్నారు. అయితే షాపుల్లో సీసీ కెమెరాలు ఉంటే, వారు చోరీ చేస్తున్న దృశ్యాలు రికార్డ్​ కాకుండా కరెంట్​ కనెక్షన్​ తొలగిస్తున్నారు. ఆ తర్వాత సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్​ డిస్క్​లను ఎత్తుకెళ్తున్నారు. ఇలా అన్ని షాపుల్లో హార్డ్​ డిస్క్​లను  మాయం చేశారు.

పని చేయని సీసీ కెమెరాలు..

కొద్ది రోజుల కింద మక్తల్​ మున్సిపాలిటీలో నిఘా పెంచేందుకు మెయిన్​ సెంటర్లు, కాలనీలు, ఆర్టీసీ బస్టాండ్​ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సీసీ కెమెరాలు చాలా చోట్ల పని చేయడం లేదని అంటున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్, సంగంబండ రోడ్డు, నారాయణపేట క్రాస్​ వద్ద ఉన్న కెమెరాలు పని చేయడం లేదని సమాచారం. అయితే చోరీలు జరిగిన సందర్భాల్లో ఈ సీసీ కెమెరాల ఆధారంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగిన వారిని గుర్తుపట్టే ప్రయత్నం చేసినా.. అవి పని చేయడం లేదని తేలినట్లు తెలిసింది.

మక్తల్​లో జరిగిన చోరీలు..

మక్తల్​ ఆర్టీసీ బస్టాండ్​ ఎదుట ఉన్న మహాలక్ష్మీ జువెలరీ షాపులో కొద్ది రోజుల కింద చోరీ జరిగింది. దొంగలు షాపు గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న మూడు కిలోల వెండి వస్తువులు, తులం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వారు చోరీ చేస్తున్న దృశ్యాలు షాపు లోపల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్​ కావడంతో, హాస్ట్​ డిస్క్​లను తీసుకెళ్లారు. ఈ షాపు పక్కనే ఓ ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్​లోకి వెళ్లిన దొంగలు రూ.3,500 చోరీ చేశారు. అక్కడా సీసీ కెమెరాకు సంబంధించిన హార్డ్​డిస్క్​ను తీసుకెళ్లారు.
    
రాయచూర్  రోడ్డులో ఉన్న శాంతమ్మ వైన్స్, శేష వైన్స్​లో దుండగులు ఒకే రోజు చోరీలకు పాల్పడ్డారు. రెండు వైన్​ షాపుల షటర్లను కరెంట్​ కట్టర్లతో కట్​ చేసి లోపలికి చొరబడ్డారు. షాపుల్లో జరిగిన చోరీ సీసీ కెమెరాల్లో రికార్డైతే తమను గుర్తిస్తారనుకున్న దుండగులు  హార్డ్ డిస్క్​ను ఎత్తుకెళ్లారు. శాంతమ్మ  వైన్​ షాపులో రూ.1.45 లక్షల నగదు, లిక్కర్​ బాటిళ్లు, శేష వైన్స్​లో రూ.45 వేల నగదును ఎత్తుకెళ్లారు.
    
విష్ణు జువెలరీ షాప్  షటర్​ లాక్​ను కట్టర్​తో కట్ చేసి దోచుకోవడానికి  ప్రయత్నించారు. కానీ, షటర్​కు సెంటర్  లాక్  సిస్టం ఉండడంతో తెరుచుకోలేదు. దీంతో షాపు వెనుక వైపు గోడకు రంధ్రం చేయడానికి ప్రయత్నించారు.
    
న్యూ మారుతి కాలనీలో దసరా సెలవులకు ఊరెళ్లిన వాకిటి సంతోష్  ఇంట్లో దొంగలు పడ్డారు. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన దొంగలు ఐదు తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. 
     
టీచర్స్ కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. బీరువాలో ఉన్న 15 తులాల వెండి, బంగారు ఆభరణాలు, రూ. 30 వేల నగదు దోచుకెళ్లారు.

స్పెషల్​ టీమ్​లు ఏర్పాటు చేశాం..

మక్తల్​లో వరుస చోరీలు జరుగుతున్నాయి. అయితే ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. రాత్రి సమయాల్లో నిఘా పెంచాం. శివారు ప్రాంతాలు, కాలనీల్లో పెట్రోలింగ్​ నిర్వహిస్తున్నాం. త్వరలో దొంగలను పట్టుకుంటాం. -రాంలాల్, సీఐ, మక్తల్