నిజాంపేట, వెలుగు: దొంగలు వస్తున్నారు, మెడలో బంగారు చైన్ ఉంచుకోవద్దని మాయమాటలు చెప్పి ఓ మహిళ దగ్గర నుంచి మూడు తులాల బంగారు చైన్‌ను దొంగించారు. ఈ ఘటన నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో మంగళవారం జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం.. నందిగామకు చెందిన బలిజ లక్ష్మి, మల్లేశం భార్యాభర్తలు. వీరు నందిగామ నుంచి రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు టూ వీలర్ పై వెళ్తున్నారు. రాయిలపూర్ గేట్ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వీరి టూ వీలర్ ను అడ్డగించారు. మేము రోడ్డుకు సంబంధించిన ఆఫీసర్లమని చెప్పారు.
ఇటువైపు దొంగలు వచ్చారు బంగారు నగలు మెడలో ధరించి రోడ్డు మీద తిరగొద్దని మాయమాటలు చెప్పి లక్ష్మి మెడలో ఉన్న మూడు తులాల బంగారు చైన్ ను పేపర్లో చుట్టి దాచిపెట్టుకోమని బాధితురాలికి ఇచ్చారు. అక్కడి నుంచి లక్ష్మి ఆమె భర్త ఇద్దరూ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు చేరుకున్న తర్వాత పేపర్ తీసి చూడగా అందులో చైన్ కు బదులు రాళ్లు ఉండడం చూసి లబోదిబోమన్నారు. అనంతరం బాధితులు నిజాంపేట పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.