నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వడ్డీ లేని రుణాలను మూడో విడత కార్యక్రమం చేపట్టారు. నల్గొండ జిల్లాలో రూ.66.78 కోట్లు నల్గొండ జిల్లాలో మొత్తం 22,997 గ్రూపులకు రూ.66. 78 కోట్లను వడ్డీ లేని రుణాల కింద పంపిణీ చేశారు. వడ్డీ లేని రుణాలలో భాగంగా ఇప్పటివరకు నల్గొండ నియోజకవర్గంలో రెండు విడతల్లో 2280 స్వయం సహాయక సంఘాలకు రూ.7.07 లక్షలు, నకిరేకల్ నియోజకవర్గంలో 4107 స్వయం సహాయక సంఘాలకు రూ. 12. 36 కోట్లు దేవరకొండ నియోజకవర్గం లో 4480 సంఘాలకు రూ.11.93 కోట్లు, మునుగోడు నియోజకవర్గంలో 3209 స్వయం సహాయక సంఘాలకు రూ.10.01 కోట్లు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 4476 సంఘాలకు రూ.13.16 కోట్లు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 3689 సంఘాలకు రూ.10.11,తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలంలో 756 గ్రూపులకు రూ. 2.12 కోట్లు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు.
సూర్యాపేట జిల్లాలో రూ.6.99 కోట్లు
సూర్యాపేట జిల్లాలో వడ్డీ లేని రుణాల కింద హుజూర్నగర్ నియోజకవర్గంలో 2888 స్వయం సహాయక సంఘాలకు రూ.2.12 కోట్లు, కోదాడ నియోజకవర్గంలో 2713 స్వయం సహాయక సంఘాలకు రూ.2.10 కోట్లు, సూర్యాపేట నియోజకవర్గంలో 1998 స్వయం సహాయక సంఘాలకు 1.53 కోట్లు, తుంగతుర్తి నియోజకవర్గంలో 1724 స్వయం సహాయక సంఘాలకు రూ.1.24 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించారు.
హుజూర్ నగర్, వెలుగు: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఏఎంసీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ లో నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు చెందిన 2888 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.2.12 కోట్లు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
సూర్యాపేట, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీకి టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 1998 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కింద రూ.1.51 కోట్ల చెక్కులను, ఇందిరా మహిళా శక్తి చీరలను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్డీఓ వేణు మాధవ్, తహసీల్దార్ కృష్ణయ్య, ఏపీడీ సురేశ్, ఎంపీడీఓ బాలకృష్ణ, పాల్గొన్నారు.
హాలియా, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మహిళలు అండగా ఉండి గెలిపించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మహిళా సంఘాలకు వడ్డీ రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రూ .13 కోట్ల 16 లక్షల మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్లు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, అంకతి సత్యం పాల్గొన్నారు.
దేవరకొండ, వెలుగు: దేవరకొండ పట్టణంలో మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులను ఎమ్మెల్యే బాలు నాయక్ పంపిణీ చేశారు. నేరేడుగొమ్ము, చందంపేట, చింతపల్లి మండలాలకు చెందిన 105 గ్రామాల్లోని 115 మంది లబ్ధిదారులకుఅధికారులతో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు.
యాదాద్రి, వెలుగు మహిళలను అభ్యున్నతి చేయాలన్నదే తమ సర్కార్ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆలేరు, భువనగిరిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను అందించి మాట్లాడారు. కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు, డీఆర్డీవో నాగిరెడ్డి ఉన్నారు.
