థర్డ్​ వేవ్​ ముప్పు ఎప్పుడో చెప్పలేం.. మరిన్ని వేవ్​లూ ఉంటయ్

థర్డ్​ వేవ్​ ముప్పు ఎప్పుడో చెప్పలేం.. మరిన్ని వేవ్​లూ ఉంటయ్
  • ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి
  • వేరియంట్లకు తగ్గట్టు వ్యాక్సిన్లను అప్​డేట్​ చేయాలి
  • ప్రస్తుతం మహారాష్ట్ర, ఏపీ, కర్నాటకలో ఎక్కువ మరణాలు
  • బెంగళూరు, చెన్నైలో భారీగా కేసులు
  • మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్​ వేవ్​ ముప్పు కూడా పొంచి ఉందని  కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం సెకండ్​ వేవ్ లో వేరియంట్ల వల్ల కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు.  థర్డ్​ వేవ్​తోపాటు మరిన్ని వేవ్​లు కూడా రావొచ్చని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే థర్డ్​ వేవ్​ ఎప్పుడు వస్తుంది?  దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడే అంచనా వేయలేమన్నారు.  కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్​పై  బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్​ సైంటిఫిక్​ అడ్వయిజర్​ కె.విజయరాఘవన్​ థర్డ్​ వేవ్​ గురించి ప్రస్తావించారు. 
థర్డ్ ​వేవ్​ ముప్పు!
‘‘కరోనా థర్డ్​ వేవ్​ అనివార్యం. దీని వ్యాప్తి ఎక్కువగానైనా ఉండొచ్చు.. లేదా తక్కువగానైనా ఉండొచ్చు. ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేం. ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి” అని ఆయన అన్నారు.  థర్డ్‌ వేవ్‌ నాటికి కరోనా వైరస్‌ మరిన్ని మార్పులు చెందే అవకాశముందని చెప్పారు. మరిన్ని వేవ్​లు కూడా రావొచ్చని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​లో కొత్త కొత్త వేరియంట్లు వస్తున్నాయని, వాటికి తగ్గట్టు వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయని,  కరోనాను ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమన్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా మాస్కులు పెట్టుకోవడం, సోషల్​ డిస్టెన్సింగ్​ పాటించడం, వ్యాక్సిన్లు తీసుకోవడమే మార్గమని నీతి ఆయోగ్​ మెంబర్​ డాక్టర్​ వీకే పాల్​ సూచించారు. కరోనా వైరస్​ జంతువుల నుంచి మానవులకు సోకదని, మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని చెప్పారు. 
12 రాష్ట్రాల్లో భారీగా కేసులు
12 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్​ కేసులు భారీగా ఉన్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్ష చొప్పున ఉన్నాయని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, కర్నాటక, ఢిల్లీ, హర్యానాలో మరణాలు ఎక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్​ అగర్వాల్​ అన్నారు.  గత వారం రోజుల్లో ఒక్క బెంగళూరులోనే 1.49 లక్షల పాజిటివ్‌‌ కేసులు వచ్చాయని,  చెన్నైలో 38 వేల మంది కరోనా బారిన పడ్డారని ఆయన వివరించారు.  దేశంలో కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయన్నారు.