
- కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- మేడిగడ్డకు 11లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- పుష్కర ఘాట్‌ను దాటి రోడ్డుపై ప్రవహిస్తున్న గోదావరి
- వెయ్యి ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రాణహితతో కలిసి ఉరకలెత్తుతోంది. 20 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు, ఉపనదుల నుంచి గోదావరిలోకి భారీ స్థాయిలో వరద చేరుతోంది. ఈ క్రమంలో సోమవారం కాళేశ్వరం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. 13.1 మీటర్ల ఎత్తుకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ వద్ద 11 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 85 గేట్ల ద్వారా అంతే వరదను దిగువకు వదులుతున్నారు.
గోదావరి నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లోని సుమారు 1,500 ఎకరాల్లోని వరి, పత్తి, మిరప పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతర్రాష్ట్ర వంతెనను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి ఉగ్రరూపాన్ని చూసి బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు జంకుతున్నారు. పుష్కర ఘాట్‌ను దాటి రోడ్డు మీదికి గోదావరి ప్రవాహం చేరడంతో భక్తులు తిప్పలు పడుతున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న షాపులు, ఇండ్లు కూడా వరద నీటిలో మునిగాయి.
భద్రాచలంలో డేంజర్ బెల్స్..
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద 45.50 గోదావరి అడుగులకు చేరుకోగా, 10,32,816 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో మంగళవారం 48 అడుగులకు, ఆ తరువాత 50 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దిగువన శబరి పోటెత్తడంతో అంచనా కష్టంగా మారుతోంది. భద్రాచలంలో స్నానఘట్టాలు నీటమునగగా, భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే ప్రాంతంలో గజ ఈతగాళ్లను, బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం–-పేరూరు రాష్ట్రీయ రహదారిలో దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద గోదావరి బ్యాక్ వాటర్ రోడ్డును ముంచెత్తింది. మిర్చి, పెసర, పత్తిపంటలు నీటమునిగాయి. వరద ఉధృతి పెరుగుతుండడంతో ఆఫీసర్లను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అప్రమత్తం చేశారు.
రామన్నగూడెం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..
ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతి పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గంటగంటకు నీటి మట్టం పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆఫీసర్లు అప్రమత్తం చేశారు.
ప్రమాదకరంగా కృష్ణానది ప్రవాహం..
మక్తల్: కృష్ణా, భీమా నదులకు వరద పోటెత్తుతోంది. ఆదివారం నుంచి 5.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, సోమవారం రాత్రి 5.60 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో తెలంగాణ-, కర్నాటక బార్డర్లో ఉన్న నారాయణపేట జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ హై అలర్ట్ ప్రకటించారు. వరదలతో కృష్ణ మండలం తంగిడి గ్రామ సమీపంలోని సంగమేశ్వర అలయం నీట మునిగింది. నారగడ్డ, కురుంగడ్డ ఆలయాలు వరద నీటిలో చిక్కున్నాయి. ఆలయ పూజారులను కర్నాటక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నీటి మునిగిన వరి పొలాలు
ప్రస్తుతం ఈ రెండు నదులకు పెద్ద మొత్తంలో వరద వస్తుండగా.. చివరగా 2019లో ఈ రెండు నదులకు 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ స్థాయిలో మరోసారి వరద వస్తుండడంతో తీర గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫీసర్లు వాసునగర్ గ్రామాన్ని ఖాళీ చేయించారు. గ్రామస్తులను సరక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క వాసునగర్లోనే 200 ఎకరాల్లో వరి పంటలు నీట మునుగగా.. గుడేబల్లూరు, ముడుమాల్, మురార్దొడ్డి, అనుగొండ, పస్పుల, పారేవుల ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది.