- ఐదుగురిపై కేసు.. ముగ్గురు అరెస్టు
- ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి
ఆదిలాబాద్, వెలుగు: ఔట్ సోర్సింగ్ జాబ్ ల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించిన రెండు సంస్థలకు చెందిన ముగ్గురిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ కు చెందిన జట్టబోయిన మధుకిరణ్, హనుమకొండకు చెందిన మాదాసి సుధాకర్ కలిసి అనంత ఈ– సొల్యూషన్’ ను, హైదరాబాద్ కు చెందిన సుజాత ఠాకూర్, లావణ్య, గోదావరిఖనికి చెందిన నమ్మని సతీశ్ కలిసి ‘ విద్యాదాన్ ఆర్గనైజర్స్’ను ఏర్పాటు చేశారు. రెండు సంస్థలు హైదరాబాద్ లో ఆఫీసులను నిర్వహిస్తూ.. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఔట్ సోర్సింగ్ జాబ్ లు ఇప్పిస్తామని, ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష నుంచి రూ.2.50 లక్షలు వసూలు చేశాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 240 మందికి ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లతో జాబ్ లు కల్పించి మూడు నెలలు జీతాలు ఇచ్చాయి. అనంతరం జీతాలు ఇవ్వకపోవడంతో మోసపోయిన బాధితులు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల కింద ఆదిలాబాద్ కు చెందిన బాధితులు రాజు, రాహుల్ తో పాటు మరో ఐదుగురు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లో ప్రధాన నిందితుడు మధుకిరణ్, సుధాకర్, సతీశ్ ను అరెస్టు చేశామని, సుజాత ఠాకూర్, లావణ్య పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
గతంలో ఆయా సంస్థల ఏజెంట్లు ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కోవా విఠల్, రాహుల్, వరలక్ష్మిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ బి. సునీల్ కుమార్, ఎస్ఐలు గోపీకృష్ణ, నాగనాథ్, అశోక్ సిబ్బంది ఉన్నారు.
