హైదరాబాద్​లో మరో మూడు ‘టిమ్స్’

హైదరాబాద్​లో మరో మూడు ‘టిమ్స్’

అల్వాల్‌‌, సనత్‌‌నగర్‌‌‌‌, కొత్తపేట్‌‌లో ఏర్పాటు
రూ. 2,679 కోట్లకు పరిపాలనా అనుమతులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో మరో మూడు తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌ (టిమ్స్) హాస్పిటళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ మొదలైంది. కొత్తగా అల్వాల్‌‌, సనత్‌‌నగర్‌‌‌‌, కొత్తపేట్‌‌(ఎల్బీనగర్‌‌‌‌) వద్ద సూపర్​ స్పెషాలిటీ హాస్పిటళ్ల కోసం రూ. 2,679 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తపేట్​ టిమ్స్​కు రూ. 900 కోట్లు, సనత్‌‌నగర్‌‌‌‌  టిమ్స్​కు రూ. 882 కోట్లు, అల్వాల్  టిమ్స్​కు రూ. 897 కోట్లు కేటాయించనున్నారు.

ఒక్కో హాస్పిటల్‌‌‌‌ను 13.71 లక్షల స్క్వేర్  ఫీట్ల విస్తీర్ణంతో నిర్మించనున్నారు.  దవాఖాన్ల నిర్మాణ బాధ్యతలను ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌ బీకు ప్రభుత్వం అప్పగించింది. ఇవి అందుబాటులోకి వస్తే గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లపై పేషెంట్ల ఒత్తిడి తగ్గుతుంది. జిల్లాల నుంచి వచ్చే ఎమర్జెన్సీ పేషెంట్లకు సిటీ శివారుల్లో ఉండే ఈ హాస్పిటళ్లతో సకాలంలో వైద్యం అందుతుంది.  
నిమ్స్​ తరహాలో అన్ని రకాల వైద్య సేవలు
కొత్తగా నిర్మించబోయే టిమ్స్ హాస్పిటళ్లకు కూడా అటానమస్‌‌‌‌ (స్వతంత్ర ప్రతిపత్తి) హోదాను ప్రభుత్వం ఇచ్చింది. గురువారం నాటి ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని పేర్కొంది. నిమ్స్ తరహాలో టిమ్స్ హాస్పిటళ్లలోనూ అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అల్వాల్, కొత్తపేట్‌‌‌‌, సనత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో స్థల సేకరణ పూర్తయింది. హాస్పిటల్ డిజైన్లు ఖరారయ్యాయి. టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే నెలలో హాస్పిటళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా కసరత్తు చేస్తున్నామని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటికే వరంగల్‌‌‌‌లో వెయ్యి కోట్లతో మల్టీ సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో ఆ హాస్పిటల్ నిర్మాణ పనులు మొదలవనున్నాయి.