ఏపీలో ఘోర ప్రమాదం.. ఓ భవనంపై కూలిన మరో భవనం

ఏపీలో ఘోర ప్రమాదం.. ఓ భవనంపై కూలిన మరో భవనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో భవనం కూలి పలువురు చనిపోగా ఇంకొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మూడంతస్తుల పాత భవనం కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. శిధిలాల కింద మూడు కుటుంబాలకు సంబంధించి తొమ్మిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిధిలాల కింద ఉన్న దంపతులను రెస్క్యూ టీమ్ కాపాడింది. హాస్పిటల్ లో వారు చికిత్స పొందుతున్నారు. మూడు అంతస్తుల పాత భవనం పక్కనున్న రెండు అంతస్తుల భవనంపై కుప్పకూలడంతో మరో ఇల్లు కూలిపోయింది. ఫైర్ ,పోలీస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ సహాయక పర్యవేక్షిస్తున్నారు. శిధిలాలను తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. పుట్టపర్తి సాయినగర్ కాలనీ వాసులను దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశాలతో.. దిశ డి.ఎస్.పి ఆర్ల శ్రీనివాసులు, పోలీసులు, స్థానికులు కలిసి... ప్రజల్ని తరలించారు.  చిత్రావతి నది వరద నీటితో పుట్టపర్తి సాయి నగర్ జలమయమైంది. వృద్ధులు, మహిళలు, బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు కడప జిల్లాలో కూడా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అర్థరాత్రి పెన్నా నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు బస్సు ఎక్కించి పంపించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జిల్లాలో కమలాపురం దగ్గర పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కంటైనర్ హౌస్ లు పెన్నా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని జొన్నవాడ పుణ్యక్షేత్రం పక్కనున్న పెనబల్లిలో భయానక పరిస్థితి ఉంది. గ్రామస్తులు.. ఇళ్ల మీదకు వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పెన్నానది, పొర్లు కట్ట రెండుచోట్ల తెగిపోవడంతో.. గ్రామంలోని భారీగా నీళ్లు వస్తున్నాయి. 

ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం జగన్  ఏరియల్  సర్వే నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పరిస్థితి సమీక్షిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. హెలికాప్టర్  ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఏరియల్  సర్వేకు ముందు కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించి... వరద పరిస్థితిపై సమీక్షించనున్నారు.