- నవంబర్ 14తో పదవీకాలం పూర్తిచేసుకుంటున్న.. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్
- ఈ మూడింటిని భర్తీచేసే ఆలోచనలో లేని ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీల పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగియనుంది. వాటిని భర్తీచేయాలంటే ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై మూడింటికి మూడు పేర్లను సూచిస్తూ ఆమోదం కోసం గవర్నర్ కు పంపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో 2026 నవంబర్14 తో పదవీకాలం పూర్తిచేసుకుంటున్న గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ స్థానంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉండనున్నాయి.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అయినందున వీటి భర్తీకి ఎన్నికల కమిషన్ నిబంధనలు వర్తించవు. ఎప్పుడైనా భర్తీ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. దీంతో వచ్చే ఏడాది మార్చిలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నందున, ఆ సమయంలో ఈ మూడు ఎమ్మెల్సీలను భర్తీ చేస్తే పార్టీకి లబ్ధి జరగనుందనేది సీఎం రేవంత్ రెడ్డి
ఆలోచనగా కనిపిస్తోందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
- ఇటు ఎమ్మెల్సీ ఖాళీలు .. అటు నామినేటెడ్ పదవుల పెండింగ్
గ్రాడ్యుయేట్ కోటాలో రెండు ఎమ్మెల్సీలను రెడ్డి సామాజికవర్గానికి కేటాయించారు. అందుకే గవర్నర్ కోటాలోని మూడింటిలో రెండు బీసీలకు కేటాయించేలా హైకమాండ్ ను కోరుతామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండింటిలో ఒకటి పద్మశాలి సామాజికవర్గానికి కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించారు.
మరో స్థానంలో బీసీలో ఏ సామాజికవర్గానికి అవకాశం రానుందనే ఉత్కంఠ కాంగ్రెస్ లో కొనసాగుతోంది. ఇక మూడో సీటును ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ, మైనార్టీ వర్గాల్లో ఒకరికి దక్కనుందనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు ఈ మూడు ఎమ్మెల్సీలు, మరోవైపు పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టడంతో రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్లో తీవ్రమైన అసహనం కనిపిస్తోంది.
