
- మంత్రి పొంగులేటికి టీఎంఎస్‌టీఏ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న స్టాఫ్‌కు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆ సంఘం రాష్ట్ర నాయకులు వరప్రసాద్, రాంరెడ్డితో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యాకమల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మోడల్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి 010 కింద వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు రాలేదని, ప్రతి నెలా పదో తారీఖు తర్వాతే వస్తున్నాయని చెప్పారు.
మరోపక్క ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు జనవరి నుంచి వేతనాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 40 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారని, వారికి కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆయన కోరారు.