ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో జల వివాదం నేపధ్యంలో రాయలసీమ ప్రాజెక్టులకు.. ముఖద్వారం  లాంటి కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను పొరుగున ఉన్న అనంతపురం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంటలిజెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా ఉన్న సుధీర్ కుమార్ రెడ్డి ని కర్నూల్ జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న అడపా సత్య ఏసు బాబుని ఇంటలిజెన్స్ ఎస్పీగా బదిలీ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఎం జగన్ పర్యటన ముగిసిన కాసేపటికే ఆ జిల్లా ఎస్పీ బదిలీ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. 
ముఖ్యంగా ఏపీలో కీలకమైన కృష్ణ... తుంగభద్ర జలాల విషయంలో తెలంగాణతో జలవివాదాలు మళ్లీ వాడీవేడీగా సాగుతున్న తరుణంలో ఈ జిల్లాపై అవగాహన ఉన్న సుధీర్ కుమార్ రెడ్డిని కర్నూలు జిల్లా ఎస్పీగా నియమించినట్లు సమాచారం. తెలంగాణతో విభేదాలు మొత్తం ఏపీ రాష్ట్రమంతా ప్రభావం చూపే అవకాశం ఉన్నా.. కృష్ణా.. తుంగభద్ర జలాలకు కర్నూలు జిల్లా ముఖద్వారం లాంటిది. ప్రస్తుత తరుణంలో ఈ జిల్లాకు ఎంతో ప్రాముఖ్యం నెలకొని ఉన్న తరుణంలో కర్నూలు జిల్లా ఎస్పీని బదిలీ చేయడం చర్చనీయాంశం అయింది. తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ కుడికాలువను ఏపీ నిర్మిస్తుండడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.అలాగే కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడాన్ని కూడా తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేస్తున్న కామెంట్లతో జల వివాదాలు ఎలాంటి మలుపులకు.. ఏ పరిణామాలకు దారితీస్తుందోనని అందరూ ఆసక్తిగా  వేచి చూస్తున్నారు. ఈ  నేపధ్యంలో ఏపీ సీఎం జగన్ కీలకమైన కర్నూలు జిల్లా బాద్యతలు కొత్త  ఎస్పీకి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.