
- ట్రంప్ ప్రభుత్వం ఆఫర్
వాషింగ్టన్: వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై రివార్డును ట్రంప్ ప్రభుత్వం రెట్టింపు చేసింది. మదురో సమాచారం ఇచ్చినవారికి, అతని అరెస్టుకు సహకరించినవారికి 50 మిలియన్ డాలర్లు(రూ. 437 కోట్లు) ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి గురువారం ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.."మదురో అనే వ్యక్తి ట్రెన్ డి అరాగ్వా, సినలోవా, కార్టెల్ ఆఫ్ ది సన్స్ (కార్టెల్ డి సోలెస్) వంటి టెర్రర్ సంస్థలను ఉపయోగించి అమెరికాలో ఘోరమైన హింసకు పాల్పడుతున్నాడు. అతను ప్రపంచంలోని అతిపెద్ద నార్కో-ట్రాఫికర్లలో ఒకడు.
అమెరికాలోకి ఫెంటానిల్ కలిపిన కొకైన్, తదితర డ్రగ్స్ సప్లయ్ చేస్తూ నార్కో-టెర్రరిజానికి పాల్పడుతున్నాడు. ఇది జాతీయ భద్రతకే ముప్పు. ట్రంప్ ప్రభుత్వం నుంచి మదురో ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. చేస్తున్న నేరాలకు అతను శిక్ష అనుభవించాల్సిందే" అని పామ్ బోండి పేర్కొన్నారు. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే నికోలస్ మదురోపై 15 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించారు. తర్వాత బైడెన్ సర్కార్ దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ సర్కార్ ఆ రివార్డును రెట్టింపు చేసింది. గతంలో ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడానికి కూడా అమెరికా ఇంతే మొత్తాన్ని ఆఫర్ చేసింది.