ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తుండు

ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తుండు
  • ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని సీఎం... దళితబంధు ఇస్తాడా?
  • బస్ చార్జీలు, కరెంట్ చార్జీలు ఎందుకు పెంచుతున్నారో చెప్పాలి
  • కేసీఆర్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు... కేసీఆర్ సంగతి చూస్తా.. పక్కా
  • కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బహిరంగ సభలో బండి సంజయ్ 

కామారెడ్డి: ఆర్టీసీని.. ఆర్టీసీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అమ్మేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 20 రోజులు అవుతున్నా ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని సీఎం కేసీఆర్ .. దళిత బంధు ఇస్తాడా అని ఆయన ప్రశ్నించారు. బస్ చార్జీలు, కరెంట్ చార్జీలు ఎందుకు పెంచుతున్నారో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. కేసీఆర్ సంగతి చూడడం పక్కా అని ఆయన నొక్కి చెప్పారు. 
 ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ బుధవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసమే 26 రోజులుగా ఎండలో ఎండుతూ... వానలో తడుస్తూ.. కాలి వేలు విరిగినా... నడుం నొస్తున్నా... తిరుగుతున్నా అని  చెప్పారు. మా అక్కలు, అన్నలను చూస్తే... కేసీఆర్ కు 90ML సరిపోవడం లేదు. ఫుల్ బాటిల్ తాగుతుండు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచుతా అంటున్నాడు, బస్సుల్లో వెళ్ళేది పేదోళ్ళే... చార్జీలు పెంచితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 
పెట్రోల్ నుంచి వ్యాట్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం రూ. 26 వసూల్ చేస్తోందని, కేంద్రం వసూల్ చేసే పన్ను నుంచి మళ్లీ తిరిగి తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. మొత్తం రూ.40 ని కేసీఆర్ ప్రభుత్వమే వసూల్ చేస్తోందని ఆయన వివరించారు. RTC కార్మికులకు ఈనెల 20వ తేదీ దాటినా  జీతాలే ఇంకా ఇవ్వలేదని, ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. యూనియన్ నుంచి అశ్వత్థామరెడ్డి ని తొలగించి ఇష్టం వచ్చినట్టు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు. 
కామారెడ్డి జిల్లా రైతులు తమ బాధలను చెప్పుకుంటున్నారని, చెరుకు రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. 'నిజాం షుగర్' ఫ్యాక్టరీ మూయించి, చెరుకు రైతుల పొట్ట కొడుతున్నాడు కేసీఆర్ అని ఆరోపించారు. రైతులను జైల్లో పెట్టిన మూర్ఖుడు.. బట్టేబాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన విమర్శించారు. 
మహిళలు, చిన్న పిల్లలపై హత్యాచార ఘటనల్లో దేశంలోనే తెలంగాణ 4వ స్థానం
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హత్యాచారాలు పెరిగిపోతున్నాయని.. హత్యాచార ఘటనల్లో దేశంలోనే తెలంగాణ 4వ స్థానంలో నిలుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ గడీల కాపలకే హోంమంత్రి ఉన్నాడు తప్ప... ప్రజల రక్షణకు కాదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.91 వేల ఇళ్ళు మంజూరు చేసిందని, తెలంగాణలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా కేసీఆర్ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు రూ.10 వేల కోట్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం కేంద్రం ఇచ్చిందన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ బయటికి వస్తాడు... ఆ తర్వాత ఫార్మ్ హౌస్ కి పోయి పడుకుంటాడని ఎద్దేవా చేశారు. పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రైతుల ఉసురు తీసుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించలేదు, పంటను నాశనం చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గుర్రంపోడుకు మేము పోతే..మాపై లాఠీ ఛార్జ్ చేసి, 40 మంది కార్యకర్తలను జైలుకు పంపారని ఆరోపించారు. పట్టాలు ఇవ్వకుండా ఫార్మ్ హౌస్ లో పండుకుండు.. 'వరి వేస్తే ఉరే' అంటుండు కేసీఆర్...పాస్ పోర్టుల బ్రోకర్ కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. 
రైతులు పండించిన ప్రతి గింజను కొనాల్సిందే 
రైతులు పండించిన ప్రతి గింజను కొనాల్సిందే, లేదంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం... ఫార్మ్ హౌస్ ను దున్నేస్తామని బండి  సంజయ్ హెచ్చరించారు. 'ప్రజా సంగ్రామ యాత్ర' నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఆయన ఆరోపించారు. మోదీ కట్టించే బాత్రూమ్ లను కూడా కేసీఆర్ వదలడం లేదు... అక్కడ కూడా కేసీఆర్ తన ఫొటోనే పెట్టించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని సీఎం... దళితబంధు ఇస్తాడా? అని ఆయన ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాకు స్థానిక టీఆర్ఎస్ నేతలు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు. గల్లా పట్టి కేసీఆర్ దగ్గర నుంచి ఎందుకు మంజూరు చేయించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. ఆశావర్కర్లకు వేతనాలు ఇవ్వడంలేదు, నర్సులను ఉద్యోగాల్లోంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.