తాలిపేరు ప్రాజెక్టు రిపేర్లకు మోక్షం.. రూ.4 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన సర్కారు

తాలిపేరు ప్రాజెక్టు  రిపేర్లకు మోక్షం..  రూ.4 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన సర్కారు
  •     కుడి, ఎడమ కాల్వల్లో రిపేర్ల కోసం పక్కా ప్రణాళిక
  •     మే నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయం.. 

భద్రాచలం, వెలుగు :  చర్ల మండలంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు రిపేర్లకు మోక్షం లభించింది. రిపేర్ల కోసం సర్కారు నిధులు విడుదల చేసింది. గతంలోనే నిధులు మంజూరైనా పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే ఈసారి రైతులు పంట విరామం కోసం ఒప్పుకోవడంతో పనులకు సుగమం అయ్యింది.

 ప్రధానంగా కాల్వల రిపేర్లకు ఆటంకం తొలగింది. గతేడాదే కుడి, ఎడమ కాల్వల రిపేర్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ గ్రాంటు నుంచి నిధులు మంజూరయ్యాయి. విడతల వారీగా పనులకు పరిపాలనాపరమైన అనుమతులు వచ్చాయి. ఎన్నికల కోడ్​ కారణంగా గతంలో పనులు ప్రారంభం కాలేదు. 

నిధుల కేటాయింపు ఇలా...!

తాలిపేరు ప్రాజెక్టులో రిపేర్ల కోసం విడుదలైన నిధులను ఖర్చు చేసేందుకు ప్లాన్​ రెడీ అయ్యింది. ప్రధాన ఎడమ కాల్వలో 9.154 కిలోమీటరు యూటీ(అండర్​ టన్నెల్​) రిపేర్లకు రూ.60.80లక్షలు, 13.098 కిలోమీటర్ల వద్ద రూ.59.30లక్షలు, 16.072 కిలోమీటర్​ వద్ద రూ.22.20లక్షలు, 24.566 కిలోమీటరు వద్ద  రూ.35లక్షలు, 14.474 కి.మీల వద్ద ఎస్​ఎల్​ ఆర్​బి  రీకనస్ట్రక్చన్​కు రూ.48.90లక్షలు, ఆర్డీ -7 డిస్ట్రిబ్యూటర్​లో స్ట్రక్చర్​ రిపేర్లకు రూ.49.75లక్షలు, ఆర్డీ-26 డిస్ట్రిబ్యూటర్​లో పైపు కల్వర్ట్​ రిపేర్లకు రూ.9.09లక్షలు, 34.338 కి.మీల వద్ద కెనాల్​ లైనింగ్, యూటి రిపేర్లకు రూ.4.50లక్షలు, ఆర్డీ-1 డిస్ట్రిబ్యూటరీలోరిపేర్లకు రూ.4.98లక్షలు, ఆర్డీ-02కు రూ.4.30లక్షలు, కుడి ప్రధాన కాల్వ ఎల్డీ -03, ఎల్డీ-04 డిస్ట్రిబ్యూటర్ల రిపేర్లకు రూ.11.04లక్షలు, 15.035 కి.మీ వద్ద యూటీ రీకనస్ట్రక్షన్ కోసం రూ.99.98లక్షలు, కుడి ప్రధాన కాల్వ ఎల్డీ -03, ఎల్డీ -04 డిస్ట్రిబ్యూటర్ల బాగు కోసం రూ.11.04లక్షలు కేటాయించారు. ఈ వేసవి ముగిసే నాటికి రిపేర్లు పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు తాలిపేరు ప్రాజెక్టు ఇంజినీర్లు యాక్షన్​ ప్లాన్​ను తయారు చేశారు. 

పక్కా ప్రణాళిక 

ఈసారి తాలిపేరు ప్రాజెక్టు కుడి,ఎడమ కాల్వల్లో రిపేర్ల కోసం ఇంజినీర్లు పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. యాసంగిలో నీటి సరఫరా నిలిపివేసి ఫిబ్రవరి నుంచి కాల్వల రిపేర్ల పనులను ప్రారంభించనున్నారు. ఖరీఫ్​ కాలం నాటికి పనులు పూర్తి కావాలంటే మే నెల నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇందు కోసం తాలిపేరు ప్రాజెక్టు ఇంజనీర్లు యాక్షన్​ ప్లాన్​ అమలు చేస్తున్నారు.