మహబూబ్‌నగర్, వెలుగు: నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే నెలలో సర్పంచులకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌ను రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొడంగల్నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఇది అదనమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా సర్పంచులకు ఈ నిధులు పంపిచే బాధ్యత తీసుకుంటామని ఆయన తెలిపారు. ‘‘గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ నిధులు వాడుకోండి” అని సర్పంచ్‌లుకు సూచించారు.
