- సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యలనుతోపాటు విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని కాచిగూడ ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పల్లా వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
స్వాతంత్ర్యానికి ముందే ఏర్పడిన తొలి ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ అని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో కొత్త మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పల్లా వెంకట్ రెడ్డి పేర్కొ్న్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. సర్కారు బడుల బలోపేతమే ఎస్టీయూ లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే టీచర్ల సంఘాలతో మీటింగ్ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండున్నర ఏండ్లు కావస్తున్నా ఇంకా అతీగతీ లేదని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
