- పక్క పార్టీ నుంచి గెలిచిండని వివక్ష చూపొద్దు
- ప్రతిఒక్కరూ మన కుటుంబ సభ్యులే
- ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం
- కొడంగల్ నుమోడల్నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం
- సీఎం రేవంత్ రెడ్డి
కోస్గి, వెలుగు : సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ముగిశాయని.. గెలిచిన సర్పంచులు అందరినీ కలుపుకొనిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కోస్గిలో బుధవారం జరిగిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమానికి సీఎం చీఫ్ గెస్ట్‌గా సీఎం హాజరై మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలని, అవి ముగిశాక రాజకీయాలకు తావు ఇవ్వకూడదన్నారు. ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో పంతాలకు పోవద్దని చెప్పారు.
ప్రతిఒక్కరూ మన కుటుంబ సభులే అనే భావన ఉండాలన్నారు. పక్క పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిపై వివక్ష చూపొద్దని, వారిపై ఎలాంటి కక్షలు పెట్టుకోవద్దన్నారు. మీరు వివక్ష చూపిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఎవరు గెలిచినా గ్రామాల్లో సమస్యలు ఉండొద్దన్నారు. చిన్న చిన్న తేడాలను పక్కన పెట్టాలని, పెద్ద మనసుతో వ్యవహరించాలన్నారు. ప్రతి గ్రామం, తండాల్లో రోడ్లు, దేవాలయాలు, బడులు, నీటి ట్యాంకులను నిర్మించుకుందామన్నారు. మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు మీపై నమ్మకం ఉండేలా సేవ చేయాలని చెప్పారు. కొడంగల్ ను దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామన్నారు.
ఒక్కొక్కరిని పిలిచి సన్మానం..
ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్పంచులను ఒక్కొక్కరిని స్టేజి మీదకు పిలిచి సన్మానం చేశారు. ఒక్కో మండలానికి సంబంధించిన సర్పంచులను స్టేజీ మీదకు పిలిచి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ మహిళా సర్పంచ్తన కుమార్తెతో స్టేజి మీదకు వచ్చింది. ఆ చిన్నారి పేపర్లో రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీసి, గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ గిఫ్ట్ తీసుకున్న సీఎం మురిసిపోతూ చిన్నారికి కృతజ్ఞతలు తెలిపారు.
సన్మానంలో భాగంగా నియోజకవర్గంలోని కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి, మద్దూరు, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల, కొడంగల్ మండలాల్లోని మొత్తం 180 మంది సర్పంచులను సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమం దాదాపు అరగంటకు పైగా సాగింది. మొత్తం గెలిచిన 180 మంది సర్పంచుల్లో 90 మంది మహిళా సర్పంచులు, 1,520 మంది వార్డు సభ్యుల్లో 800 మంది మహిళలు ఉండడం విశేషం. సన్మానం ముగిసిన అనంతరం సీఎం 180 మంది సర్పంచులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.
ఇంటింటికీ తిరగండి..
సర్పంచులుగా గెలిచిన వ్యక్తులు మీ ప్రాంతాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు రాసిపెట్టుకోవాలని సీఎం సూచించారు. గ్రామంలో ప్రతి ఇంటింటికీ తిరగాలని, అప్పుడే మీకు సమస్యలు తెలుస్తాయని చెప్పారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. పథకాలు అందని లబ్ధిదారుల పేర్లను నోట్ చేసుకొని, వారికి పథకాలు వర్తింపజేసేలా చూడాలని సీఎం కోరారు.
