పిల్లల విక్రయ ముఠా అరెస్టు .. 11 మందిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

పిల్లల విక్రయ ముఠా అరెస్టు .. 11 మందిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
  • ఇద్దరు చిన్నారులను కాపాడి శిశువిహార్‌‌‌‌కు తరలింపు
  • నిందితులకు ‘సృష్టి’ కేసుతో సంబంధం

మాదాపూర్, వెలుగు: పిల్లలను కొనుగోలు చేసి అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 11 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు శిశువులను రక్షించి, శిశువిహార్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్​డీసీపీ రితిరాజ్​బుధవారం గచ్చిబౌలిలోని ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. ఏపీలోని కడప జిల్లాకు చెందిన వి.బాబురెడ్డి మేడ్చల్‌‌‌‌లో ఉంటూ ఐవీఎఫ్ ఏజెంట్‌‌‌‌గా పని చేస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వి.గంగాధర్ రెడ్డి సికింద్రాబాద్‌‌‌‌లో ఉంటున్నాడు. ఇతను గతంలో ఐవీఎఫ్ ఏజెంట్‌‌‌‌గా పని చేశాడు. వీళ్లు గ్యాంగ్‌‌‌‌లను ఏర్పాటు చేసుకొని చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మహిళలను తమ అనుచరుల ద్వారా సంప్రదిస్తున్నారు. వాళ్ల కుటుంబాలకు డబ్బు ఆశ చూపించి, మహిళలు డెలివరీ అయిన తర్వాత శిశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ శిశువులను సంతానం లేని వాళ్లకు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు అమ్ముతున్నారు. గంగాధర్ రెడ్డి గతంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చాడు. ఇతనిపై 13 కేసులు ఉన్నాయి. ఇక బాబురెడ్డి గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చాడు. 

నగరానికి తీసుకొస్తుండగా అదుపులోకి.. 

గంగాధర్ రెడ్డికి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన దారం లక్ష్మి, హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన సంగీతాదేబి, మూసాపేటకు చెందిన కె.హర్షరాయ్‌‌‌‌ అనుచరులుగా ఉన్నారు. వీళ్లు గుజరాత్ అహ్మదాబాద్‌‌‌‌లో 10 రోజుల వయసున్న శిశువును కొనుగోలు చేశారు. బాబురెడ్డి సైతం తన అనుచరులు నారపల్లికి చెందిన సుజాత, సికింద్రాబాద్‌‌‌‌కు చెందిన అనురాధ, బేగంపేటకు చెందిన జ్యోతి, చింతల్‌‌‌‌కు చెందిన మాధవితో కలిసి సిద్దిపేట జిల్లా రామన్నపేటలో మధ్యవర్తి ద్వారా 10 రోజుల శిశువును కొనుగోలు చేశారు. వీరికి జీడిమెట్లకు చెందిన రామ్ హరిరాయ్, ముషీరాబాద్‌‌‌‌కు చెందిన శోభ సాయం చేశారు. ఈ రెండు ముఠాలు ఇద్దరు శిశువులను హైదరాబాద్‌‌‌‌కు తీసుకొస్తుండగా మియాపూర్, శంషాబాద్ ఎస్‌‌‌‌వోటీ పోలీసులు పట్టకున్నారు. మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఐవీఎఫ్ సెంటర్లు, ఆసుపత్రులతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిశువులను విక్రయించిన మధ్యవర్తులు, తల్లిదండ్రుల వివరాలు సేకరిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.