ఆర్టీసీ బిల్లుపై సస్పెన్స్​.. డ్రాఫ్ట్​పై వివరణ కోరిన గవర్నర్​

ఆర్టీసీ బిల్లుపై సస్పెన్స్​.. డ్రాఫ్ట్​పై వివరణ కోరిన గవర్నర్​
  • కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్​ను రెగ్యులరైజ్ చేస్తరా?
  • ఆస్తులు కార్పొరేషన్ పరిధిలోనే ఉంటయా.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటదా?
  • ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్, ప్రయోజనాలు ఉంటయా? 
  • క్యాడర్, ప్రమోషన్లు ఏ రకంగా ఉంటయ్​?
  • బస్సుల నిర్వహణ ప్రభుత్వమే చేస్తదా?
  • ప్రయాణికుల సమస్యలు ఎవరు పరిష్కరిస్తరు?
  • భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదనే అడుగుతున్నట్లు వెల్లడి
  • వివరణలు పంపిన సీఎస్​
  • మరిన్ని సందేహాలు లేవనెత్తిన గవర్నర్​

ఆర్టీసీ విలీన బిల్లు.. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాల ఎమోషన్​కు సంబంధించినది. బిల్లుకు రాజ్ భవన్ అడ్డుపడటం లేదు. భవిష్యత్​లో ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ఉండటం కోసమే నేను సందేహాలు నివృత్తి చేయాలని అడిగిన. ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి, కార్మికుడి హక్కులు కాపాడటమే నా ఉద్దేశం.

గవర్నర్​ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు డ్రాఫ్ట్ కు గవర్నర్ అనుమతిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. పలు సందేహాల నేపథ్యంలో శనివారం సాయంత్రం వరకు గవర్నర్ తమిళిసై అనుమతి ఇవ్వలేదు. శుక్రవారం ఈ డ్రాఫ్ట్ పై తాను అడిగిన 5 ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. వీటికి వివరణ ఇస్తూ సీఎస్ శాంతి కుమారి రాజ్ భవన్ కు డ్రాఫ్ట్ పంపారు. శనివారం గవర్నర్ ఆమోదిస్తే అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వం వివరణ ఇచ్చాక మరికొన్ని సందేహాలు ఉన్నాయంటూ గవర్నర్ మరో నోట్ ను మీడియాకు విడుదల చేశారు. వీటిపై క్లారిటీ ఇస్తే వెంటనే అంగీకారం తెలుపుతానన్నారు. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నట్లు తెలుస్తున్నది. బిల్ కు గవర్నర్ కాన్సెంట్ తెలపకపోవటంతో వివరణ ఇచ్చి సోమవారం కూడా అసెంబ్లీ నిర్వహించి బిల్లును పాస్ చేసే అవకాశాలున్నాయి.

ఇది ఉద్యోగుల ఎమోషనల్ అంశం

ఆర్టీసీ బిల్లు అనేది వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాల ఎమోషన్ కు సంబంధించినదని గవర్నర్ తన నోట్ లో గవర్నర్ పేర్కొన్నారు. ఈ బిల్లుకు రాజ్ భవన్ అడ్డుపడటం లేదని, భవిష్యత్ లో లీగల్ సమస్యలు రాకుండా ఉండటం కోసమే తాను సందేహాలు నివృత్తి చేయాలని అడిగినట్లు స్పష్టం చేశారు.  ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, కార్మికుడి హక్కులు కాపాడటమే తన ఉద్దేశమన్నారు. సీఎస్ ఇచ్చిన రిప్లైలో పేరా 4 లో పేర్కొన్న ప్రకారమే తాను వివరణ అడుగుతున్నట్లు తెలిపారు. విలీన ప్రకియ ఎలాంటి ఇబ్బందులు, చట్టపరమైన సమస్యలు రాకుండా ఆమోదం పొందాలనేదే తన ఉద్దేశమన్నారు.

ప్రస్తుతం ఉన్న క్యాడర్​లు కొనసాగిస్తం: సీఎస్

ఆర్టీసీలో ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పెన్షన్, ఇతర రూల్స్‌కు సంబంధించి ప్రతిపాదిత బిల్లులో స్పష్టంగానే ఉంది. సెక్షన్ 4, 5 ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయంలో అవసరమైన నిబంధనలను నోటిఫికేషన్ ద్వారా రూపొందించడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తాయి. ప్రతిపాదిత బిల్లులోని 4, 5 సెక్షన్‌లు చట్టం యొక్క అనుమతించిన రూల్స్​లో ఉన్నాయి. బిల్లులోని సెక్షన్‌లు 4, 5 అటువంటి విషయాలపై నిర్ణయం తీసుకోవడానికి తగినన్ని అనుమతించే నిబంధనలను కలిగి ఉన్నాయి. జీతాలు, అలవెన్సుల విషయంలో ఏ ఉద్యోగి కి ఇబ్బందులు ఎదురుకావు. ఆర్టీసీలో ఉన్న కేటగిరీలు, క్యాడర్లను కొనసాగిస్తాం” అని సీఎస్ వివరణ ఇచ్చారు.

గవర్నర్ తొలుత అడిగిన వివరణలు

1. విలీన బిల్లు డ్రాఫ్ట్ లో ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉందని పేర్కొంది. విలీనం చేస్తున్నట్లు కేంద్రానికి సమాచారం ఇచ్చారా.. కేంద్రం ఇందుకు అంగీకరించిందా.. ఒప్పుకుంటే సంబంధిత లేఖ పంపండి.
 2. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విలీనం అయ్యాక రెగ్యులరైజ్ చేస్తరా.. డిపోల వారీగా వివరాలు పంపండి.
3. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తరువాత కూడా కార్పొరేషన్ కొనసాగుతుంది అని బిల్లులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ పరిధిలోనే ఉంటాయా.. ప్రభుత్వానికి బదిలీ అవుతాయా?
4. విలీనం తరువాత బస్సుల నిర్వహణ ప్రభుత్వం చేస్తుందా..? ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతరు.. అప్పుడు వారి డ్యూటీలు ఎవరి ఆధీనంలో ఉంటాయి. లక్షలాది ప్యాసింజర్ల సమస్యల పరిష్కారం ఎవరు చేస్తరు?
5. విలీనం అయ్యాక ఉద్యోగులు ఆర్టీసీలో డిప్యూటేషన్ పద్ధతిలో పనిచేస్తరా లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా?

వీటిపైనా స్పష్టత ఇవ్వాలన్న గవర్నర్

ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్​పై గవర్నర్ మరో 5 అంశాల్లో సందేహాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగారు. కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరింత స్పష్టత ఇవ్వాలని తమిళిసై కోరారు.
1.1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్లు, ఇతర సాయం గురించి డ్రాఫ్ట్ లో వివరాలు లేవు.
2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై పూర్తి వివరాలు లేవు.
3.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది?
4. ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పెన్షన్ ఉంటుందా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించడంపై స్పష్టమైన వివరాలు ఇవ్వండి.
5. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందేలా స్పష్టమైన వివరాలు ఇవ్వండి.

సీఎస్ వివరణ ఇది..

1. నిజాం నుంచి ఏపీఎస్​ ఆర్టీసీగా మారినప్పుడు ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ రూ.140 కోట్లు, కేంద్ర ఈక్విటీ రూ.61 కోట్లుగా ఉంది. ప్రస్తుత బిల్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసమే.
2. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోకి మారిన తర్వాత అన్ని అంశాల్లో  గతంలో మాదిరే పని చేస్తుంది.
3. ఈక్విటీ, లోన్, గ్రాంట్ లేదా కేంద్ర సాయానికి సంబంధించిన సమస్యలపై ఆర్టీసీ  చట్టం–1950 రూల్స్ ప్రకారం కార్పొరేషన్ బోర్డు టీఎస్ ఆర్టీసీ అపెక్స్ బాడీగా కొనసాగుతుంది. అభ్యంతరాలను స్టేట్‌మెంట్‌లో పేర్కొనాల్సిన అవసరం లేదు.
4. ప్రభుత్వంలో విలీనమైనా కార్పొరేషన్ కొనసాగుతుంది. విభజన సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్పొరేషన్ స్వభావం మారదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను సమర్పించాక, విభజన అంశాలు  కేంద్ర  పరిశీలనలో ఉంటాయి.
5. ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత లేబర్ చట్టాలు యథావిధిగా అమలు అవుతాయి. లేబర్ యాక్ట్ లో ఉన్న రూల్స్ కొనసాగుతాయి. బిల్లులో దీనికి కొత్త రూల్స్ అవసరం లేదు. ఉద్యోగుల ప్రయోజనాలు విలీనం తర్వాత పెరుగుతాయి.