డంగు సున్నం కరిగిన చోట్ల సిమెంట్​ పూతలు

డంగు సున్నం కరిగిన చోట్ల సిమెంట్​ పూతలు

యాదగిరిగుట్ట, వెలుగు :రూ.1200 కోట్లతో పునర్నిర్మించి ప్రారంభించిన రెండు నెలలకే యాదగిరిగుట్టలోని ప్రధానాలయంతో పాటు రోడ్లకు  రిపేర్లు చేయాల్సి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన ఒక్క వానకే ఆలయంలో లోపాలు బయటపడ్డాయి. దీంతో వైటీడీఏ ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టారు. పూర్తిగా కృష్ణశిలతో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపాల నుంచి నీళ్లు లీక్​కావడంతో పాటు రోడ్లన్నీ కుంగిపోయాయి. సిమెంట్ కాకుండా డంగు సున్నం వాడి అష్టభుజి ప్రాకారాలను కృష్ణశిలతో నిర్మించగా, వర్షానికి సున్నం కరిగిపోయి వాటర్ లీకయ్యింది. దీంతో డంగు సున్నం ప్లేస్ లో సిమెంట్ నింపి పనులు చేస్తున్నారు. దీనికోసం కృష్ణశిలల మధ్య గ్యాప్ లో చిన్న చిన్న పైపులను పెట్టి మెషీన్ల సాయంతో వాటర్ తో మిక్స్ చేసిన సిమెంట్ లిక్విడ్ ను పంపింగ్ చేస్తున్నారు. 

ఎగ్జిట్ ఘాట్ రోడ్డుకు తాత్కాలిక రిపేర్లు

బుధవారం కురిసిన భారీ వర్షానికి కొత్తగా యాదగిరిగుట్టలో కొండ చుట్టూ నిర్మించిన ఆరులైన్ల రింగు రోడ్డు సహా ఎగ్జిట్ ఘాట్ రోడ్డు కూడా కుంగిపోయింది. దీంతో ఆఫీసర్లు వాటి రిపేర్లు కూడా స్పీడప్  చేశారు. ఎగ్జిట్ ఘాట్ రోడ్డు దిగువ భాగంలో రోడ్డు కుంగిపోవడంతో దానిని పూర్తిగా తొలగించి తాత్కాలికంగా మట్టి నింపి రాకపోకలు పునరుద్ధరించారు. డ్రైన్ లైన్ల నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత కుంగిన రోడ్డును పటిష్టంగా ఏర్పాటు చేస్తామని అంటున్నారు.  

రింగ్ రోడ్డుకు డ్రైన్ లైన్లు

వర్షం కారణంగా ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రింగు రోడ్డు మీదుగా వైకుంఠ ద్వారం వద్దకు వచ్చే దారిలో ఈశాన్యంలో భారీగా వరద నిలిచిపోయింది. ఆ నీరు బయటకు వెళ్లడానికి డ్రైన్ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో వర్షపు నీరు మొత్తం రింగు రోడ్డులో నిలిచిపోయింది. దీంతో దాదాపు ఎనిమిది చోట్ల రింగు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్ ను కట్ చేసి డ్రైన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా డ్రైన్ లైన్ల ద్వారా ఊర చెరువు పక్క నుంచి.. రోడ్డు కింద ఏర్పాటు చేసిన కల్వర్టు ద్వారా బయటకు పోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆఫీసర్ల పర్యవేక్షణా లోపం, క్వాలిటీ పాటించకుండా కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేయడంతోనే ఇలా జరిగిందని నర్సన్న భక్తులు ఆరోపిస్తున్నారు.