మున్సిపల్ ఎన్నికలు: ఓటుకు రెండు వేలు

V6 Velugu Posted on Apr 28, 2021

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​పై టీఆర్​ఎస్​ నేతలు టెన్షన్​ పడుతున్నారు. ఎంత ఎన్నికల ప్రచారం చేసినా జనాలు ఓటేసేందుకు వస్తారా? అని ఆందోళన చెందుతున్నారు. పోలింగ్​ శాతంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓటర్లను పోలింగ్​ బూత్​లకు రప్పించేందుకు.. ఒక్కొక్కరికి రూ.2 వేల దాకా ముట్టజెప్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లోని జనం ఎన్నికల ప్రచారం కోసం తమ ఇంటికి రావొద్దంటూ గేట్లకు పోస్టర్లు అంటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి పోలింగ్​ శాతం తగ్గే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లకు అధికార పార్టీ నేతలు డబ్బులు ఇస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30న వరంగల్​, ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్​ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  

తామే ఎక్కువిస్తున్నమన్న ఓ లీడర్​

మహమ్మారి ప్రభావం పోలింగ్​పై పడకుండా స్థానిక నేతలతో కలిసి టీఆర్​ఎస్​ అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్ల ఫోన్​ నంబర్లను తీసుకుని ఫోన్​ చేస్తున్నారు. ఓటేయడానికి వస్తే రూ.2 వేలు ఇస్తామంటున్నారు. డబ్బులు తీసుకున్నోళ్లు కచ్చితంగా తమకే ఓటేస్తారన్న నమ్మకం ఉందని వరంగల్​ ఎన్నికల బాధ్యతలు చూస్తున్న టీఆర్​ఎస్​ నేత ఒకరు చెప్పారు. ‘‘మిగతా పార్టీలు డబ్బులు ఎక్కువ ఇవ్వలేవు. మేమే ఎక్కువగా ఇస్తున్నాం. పోలింగ్​ శాతం తగ్గితే కొన్ని చోట్ల టీఆర్​ఎస్​ రెబెల్స్​ గెలిచే ప్రమాదం ఉంటుంది. అందుకే పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆ లీడర్​ చెప్పుకొచ్చారు. ఇక, ఓటర్లకు డైరెక్ట్​గా డబ్బులివ్వకుండా గూగుల్​ పే లేదా ఫోన్​ పే వంటి వ్యాలెట్ల ద్వారా ట్రాన్స్​ఫర్​ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. డైరెక్ట్​గా డబ్బులిస్తే మహమ్మారి తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదముండడంతో ఆన్​లైన్​ ద్వారా డబ్బులు ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది.

Tagged Municipal Elections, Two thousand rupees, per vote

Latest Videos

Subscribe Now

More News