ఉక్రెయిన్లో రైల్వే స్టేషన్​పై రష్యా దాడి

 ఉక్రెయిన్లో  రైల్వే స్టేషన్​పై రష్యా దాడి
  • ఉక్రెయిన్​లో 50 మంది మృతి, 100 మందికి గాయాలు  
  • దాడి సమయంలో స్టేషన్​లో వెయ్యిమందికిపైగా జనం  
  • స్టేషన్​పై తాము అటాక్ చేయలేదన్న రష్యా 
  • రష్యా దుర్మార్గాలకు హద్దులు లేవు: జెలెన్ స్కీ   
  • దాడి సమయంలో స్టేషన్​లో వెయ్యిమందికిపైగా జనం  
  • స్టేషన్​పై తాము అటాక్ చేయలేదన్న రష్యా

కీవ్:  ఉక్రెయిన్​లో మరో దారుణం జరిగింది. డోనెట్స్క్ రీజియన్ లో ప్రభుత్వ అధీనంలో ఉన్న క్రామటోర్స్క్ సిటీ రైల్వే స్టేషన్ పై శుక్రవారం ఉదయం భారీ మిసైల్ దాడి జరిగింది. రష్యా మిసైల్ దాడిలో 50 మంది పౌరులు చనిపోయారని, మరో 100 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. క్షిపణి దాడి జరిగిన సమయంలో స్టేషన్ లో వెయ్యి మందికిపైగా జనం ఉన్నారని, ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు క్యూలో నిల్చున్నవాళ్లపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు. రష్యా టోచ్ కయూ క్షిపణిని ప్రయోగించిందని, ఇందులో క్లస్టర్ బాంబులను ఉంచడం వల్ల పలుసార్లు వరుసగా పేలుళ్లు జరిగాయని డోనెట్స్క్ గవర్నర్ పావ్ లో కిరిలెంకో చెప్పారు. అయితే, రైల్వే స్టేషన్​పై తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని రష్యా ప్రకటించింది. పౌరులను రక్షణ కవచంగా వాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా ఉక్రెయిన్ బలగాలే ఈ దాడికి పాల్పడ్డాయని రష్యా రక్షణ శాఖ చెప్పింది. 
రష్యన్ డిప్లమాట్లను వెలేసిన జపాన్ 
ఉక్రెయిన్ లో యుద్ధం పేరిట సాధారణ పౌరులను రష్యా హతమారుస్తోందంటూ ఇప్పటికే యూరోపియన్ యూనియన్, ఇతర పలు దేశాలు రష్యన్ డిప్లమాట్లను బహిష్కరించాయి. తాజాగా రష్యాపై జపాన్ కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ దేశంలోని 8 మంది రష్యన్ డిప్లమాట్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్​పై రష్యా దాడి వల్ల గోధుమలు, ఇతర ధాన్యాల ఎగుమతులకు ఆటంకం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు మునుపెన్నడూ లేనంత స్థాయికి పెరిగాయని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) ఆందోళన వ్యక్తంచేసింది.   
ఎదుర్కొనే ధైర్యంలేకే దుర్మార్గాలు
రష్యాది హద్దులు లేని దుర్మార్గమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. రైల్వే స్టేషన్ వద్ద దాడి తర్వాత మృతదేహాలు, లగేజ్ బ్యాగులు చెల్లా చెదురుగా పడి ఉన్న ఫొటోలను, ధ్వంసమైన స్టేషన్ పరిసరాలకు సంబంధించిన ఫొటోలను జెలెన్ స్కీ శుక్రవారం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్​లో షేర్ చేశారు. ‘‘మానవత్వం లేని రష్యన్లు తమ పద్ధతులు మార్చుకోవడం లేదు. యుద్ధరంగంలో మనకు ఎదురుపడి నిలబడే ధైర్యం, బలం లేనందుకే వాళ్లు ఇలా నరమేధానికి పాల్పడుతున్నారు” అని మండిపడ్డారు.

 ‘‘ప్రజలపై ద్వేషంతోనే వాళ్లు అందరినీ నాశనం చేయాలనుకుంటున్నరు. వాళ్ల దుర్మార్గానికి హద్దులు లేవు. వాళ్లను శిక్షించకపోతే ఇది ఎప్పటికీ ఆగదు” అని స్పష్టంచేశారు. రష్యన్ బలగాలు ఉత్తరం నుంచి తూర్పుకు కదులుతున్నందున.. వాళ్లు ఉత్తరాదిన చేసిన దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయన్నారు. మరియుపోల్​లోనూ రష్యన్ బలగాలు చేసిన ఘోరాలు ప్రపంచానికి తప్పక తెలుస్తాయన్నారు. బుచాతో మొదలుకొని రష్యన్లు వదిలివెళ్లిపోయిన ప్రతి నగరంలోనూ అలాంటి దారుణాలే బయటపడ్తున్నాయన్నారు.