- మహిళలను ఇంటితో, పురుషులను నాయకత్వంతో ముడిపెడుతున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్
- ఐక్యరాజ్యసమితి విమెన్ విభాగం పరిశోధనలో వెల్లడి
న్యూయార్క్: సమాజంలో ఉన్న లింగ, జాతి వివక్షలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వ్యవస్థల్లో కూడా నాటుకుపోతున్నాయని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం చేసిన ఒక పరిశోధనలో వెల్లడైంది. 133 ఏఐ వ్యవస్థలపై చేసిన ఈ పరిశోధనలో 44 శాతం వ్యవస్థలు లింగ వివక్షను, 25 శాతానికి పైగా వ్యవస్థలు లింగ, జాతి వివక్షలను ప్రదర్శించినట్లు పరిశోధకులు గుర్తించారు. లార్జ్ లాంగ్వేజ్ నమూనాలు(ఎల్‌ఎల్‌ఎం) మహిళలను ఇల్లు, కుటుంబం, పిల్లల సంరక్షణ వంటి అంశాలతో ముడిపెడుతూ, మగవాళ్లను బిజినెస్, లీడర్‌షిప్, కెరీర్ సక్సెస్ వంటివాటితో అనుసంధానిస్తున్నట్లు తేలింది.
కొన్ని సందర్భాల్లో అయితే, మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా లేదా పురుషులకు లోబడి ఉండే వారిగా చిత్రీకరిస్తున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి జెండర్‌ను సూచిస్తూ వాక్యాన్ని రాయమని ఏఐని అడిగినప్పుడు ఐదింటిలో ఒక సమాధానం (20 శాతం) మహిళా వ్యతిరేకత లేదా లింగ వివక్షతో ఇచ్చింది. కొన్ని మోడల్స్ మహిళలను పురుషుల ఆస్తిగా, వస్తువులుగా కూడా పేర్కొన్నాయి.
ఇది ‘బగ్’ కాదు.. మనం నేర్పిన పాఠమే!
అయితే ఇది సాంకేతిక లోపం (బగ్) కాదని, కొన్ని దశాబ్దాలుగా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న మానవ చరిత్ర, మూస పద్ధతులు, పక్షపాతాల నుంచి ఏఐ ఈ విషయాలను నేర్చుకుందని యూఎన్ విమెన్ విభాగం స్పష్టం చేసింది. ‘‘దశాబ్దాలుగా మనుషులు రాసిన సమాచారం నుంచే ఏఐ ఈ వివక్షను సేకరిస్తోంది. దాన్నే ఇప్పుడు ప్రతిబింబిస్తోంది” అని యూఎన్ విమెన్ డిజిటల్ టెక్నాలజీస్ విభాగం ప్రతినిధి జయత్మ విక్రమనాయకే పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈమెయిల్స్ రాయడానికి, ప్రెజెంటేషన్లు సిద్ధం చేయడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏఐని వాడుతున్నారు. వాటిలో కూడా చాలామంది మహిళలపై వివక్ష చూపిస్తున్నారు. అందుకే ఈ ధోరణి మరింత పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరిగిపోతున్న సైబర్ దాడులు
గతంతో పోలిస్తే ఏఐ వచ్చాక మహిళలపై డిజిటల్ దాడులు పెరిగాయి. యూఎన్ విమెన్ విభాగం చేసిన సర్వేలో పాల్గొన్న మహిళా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల్లో దాదాపు నలుగురిలో ఒకరు (25శాతం) ఏఐ ఆధారిత ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారు. 12 శాతం మంది తమ వ్యక్తిగత చిత్రాలు అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో షేర్ అయ్యాయని తెలిపారు. 6 శాతం మంది డీప్‌ఫేక్స్ (మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు) వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరిష్కారం ఏమిటి ?
అనేక ఏఐ వ్యవస్థల్లో జాతి వివక్ష కూడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వివిధ సామాజిక వర్గాలపై ఉన్న మూస ధోరణులు, పక్షపాతాలను ఏఐ మరింత బలపరిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి, ఏఐ సాంకేతికతను రూపొందించే దశ (డెవలప్‌మెంట్) నుంచి, దానిని మార్కెట్‌లోకి తీసుకువచ్చే (డిప్లాయ్‌మెంట్), నియంత్రించే (గవర్నెన్స్).. ఇలా ప్రతి దశలోనూ సమానత్వానికి, మహిళలు, బాలికల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలని యూఎన్ విమెన్ డిమాండ్ చేస్తోంది. ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తుందా? లేదా? అన్నదానికంటే సమాజంలోని చెడు అలవాట్లు, పక్షపాతాలను వారసత్వంగా స్వీకరించకుండా చూడటమే ప్రస్తుతం పెద్ద సవాలుగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
